IPL-2021 SUSPENDED: సేమ్ చిన్నప్పటి మూడు చేపల తీరే! ఐపీఎల్ వాయిదా.. అయోమయంలో ఆసీస్ క్రికెటర్లు!!

చిన్నప్పడు మనం మూడు చేపల కథ చదివే ఉంటాం. దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే మూడు చేపలుంటాయి. భవిష్యత్ లో వచ్చే ఆపదన ముందే తెలుసుకుని తగు జాగ్రపడుతుంది దీర్ఘదర్శి. సమస్య వచ్చిప్పుడు అప్పటికప్పుడు తప్పించుకునే తెలివి ప్రాప్తకాలజ్ఞుడి సొంతం. ముందుచూపు, సమస్ఫూర్తి లేకుండా కష్టాల పాలవడం దీర్ఘసూత్రుడి తెలివి తక్కువ తనం.
ఇంతకీ మూడు చేపల కథ ఎందుకు చెప్పానంటే.. ఐపీఎల్ సందర్భంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఆలోచన అచ్చం ఈ మూడు చేపల్లాగే ఉంది. కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని ముందే ఊహించి
ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆండ్రూ టై, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ టోర్నీకి ముందే లెఫ్ట్ అయ్యారు. దీర్ఘదర్శి తీరును కొనసాగించారు. ఆట మధ్యలో పరిస్థితి చేదాటుతుందని గ్రహించి పాల్ రైఫిల్ ఐపీఎల్‌కు దూరం అయ్యారు. ప్రాప్తకాలజ్ఞుడిలా సమస్యకు పరిష్కారం వెతికాడు.
కానీ కొందరు ఆసీస్ క్రికెటర్ల పరిస్థితి ప్రస్తుతం దీర్ఘసూత్రుడిలా అయోమంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోవడంతో ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటి అనేది అర్థం కావడం లేదు. చాలామంది క్రికెటర్లు, వారితో పాటు ఆసీస్‌కు చెందిన కోచింగ్ స్టాఫ్, సహాయక సిబ్బంది ఇక్కడే ఉన్నారు. ఆస్ట్రేలియాకు భారత్ నుంచి విమాన రాకపోకలు బ్యాన్ చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
భారత్ లో కరోనా కల్లోలం నేపథ్యంలో మే15 వరకూ భారత్ విమానాలను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో తాము ఎలా స్వదేశాలకు వెళ్లాలో వారికి అర్థం కావడం లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఏమీ చేయలేమని చేతులెత్తేయడంతో.. వారికి బీసీసీఐ ఒక్కటే దిక్కైంది. బీసీసీఐ పెద్దలు రంగంలోకి దిగితే తప్ప వారు ఆస్ట్రేలియాకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఐపీఎల్‌ను వాయిదా వేసిన బీసీసీఐ.. విదేశీ క్రికెటర్లను సేఫ్ గా వారి దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది.