TELANGANA LOCKDOWN: రేపటి నుంచి 22 వరకు తెలంగాణ లాక్ డౌన్.. మందుబాబులకు గుడ్ న్యూస్..పదో తరగతి విద్యార్థులు పాస్!

కోవిడ్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈనెల 20వ తారీఖున మరోసారి మంత్రివర్గం సమావేశం జరగనుంది. లాక్ డౌన్ కొనసాగించడామా లేదా అనేది ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక మే 12 వ తారీఖు నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుండటంతో సర్కార్ కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
సర్కార్ రిలీజ్ చేసిన మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయం,మీడియా విద్యుత్ రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయించారు. ప్రభుత్వ కార్యాలన్నీ కూడా 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి. బ్యాంకులు, ఏటీఎం ఎప్పటిలాగే కార్యక్రమాలను కొనసాగిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు ఉపాధి హామీ పనులకు లాక్ డౌన్ నుంచి మినహాంపునిచ్చారు. సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్ జిమ్ములు మూసివేయాలి.
ఇక ప్రజారవాణా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. సిటీ బస్సులు, జిల్లా సర్వీసులు, కూడా లాక్ డౌన్ సడలింపు సమయంలోనే తిరుగుతాయి. అంత్యక్రియలకు 20మంది, శుభకార్యాలకు 40మందికి మాత్రమే అనుమతిస్తూ సర్కార్ జీవోను జారీ చేసింది. ఇక మంత్రి కేటీఆర్ అధ్యక్షన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. టీకాలు, మందుల సరఫరాలో అవతవకలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ఇక రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది…తెల్లారి లేవగానే మద్యం షాపుల ముందు క్యూ కట్టాల్సి అవసరం లేదు. లాక్ డౌన్ కాలంలో వైన్స్ లను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక లాక్డౌన్లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఈ చర్యలు చేపట్టింది.
లాక్ డౌన్ను కఠినంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుననుసరించి లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లనుండి డీ.ఐ.జీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగాక్షేత్ర స్థాయిలో ఉండి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టడంతోపాటుగా..లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని డీజీపీ వెల్లడించారు.
అటు కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎఫ్‌ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్వర్వుల్లో పేర్కొంది. కొవిడ్ కారణంగా పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించి జీవో జారీ చేసింది. టెన్త్ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తామని స్పష్టం చేసింది. జూన్ రెండో వారంలో సమీక్షించి రెండో సంవత్సర పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని, బ్యాక్‌లాగ్ ఉన్న రెండో సంవత్సరం విద్యార్థులకు కనీస పాస్ మార్కులు వేస్తామని గతంలో ప్రభుత్వం తెలిపింది.