కరోనా కట్టడి పీఎంవో వల్ల కాదు.. ఆ పని గడ్కరీకి అప్పజెప్పండి.. ప్రధానికి సుబ్రమణ్య స్వామి సూచన.. హర్షవర్ధన్ కు పూర్తి స్వేచ్ఛలేదని వెల్లడి

బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కరోనా పాండమిక్ సమయంలో కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడి కోసం ప్రధాన మంత్రి కార్యాలయం మీద ఆధార పడటం వేస్ట్ అన్నారు. ఆ బాధ్యతలను మంత్రి నితిన్ గడ్కరీకి ఇస్తే బాగుంటుందని ప్రధాని మోదీకి సూచించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.
ముస్లిం చొరబాటుదారులు, బ్రిటీష్ సామ్రాజ్యవాదులను ఎదిరించినట్లే.. భారత్ కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తుందన్నారు. ఇప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేదంటే పిల్లలను టార్గెట్ చేసే మరో కరోనా వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అంతేకాదు.. కరోనాపై పోరు బాధ్యతలను వెంటనే గడ్కరీకి అప్పగించాలన్నారు. పీఎంవోపై ఆధారపడటం దండుగ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
అటు తాను ప్రధానమంత్రి కార్యాలయాన్ని విమర్శిస్తున్నాను తప్ప.. ప్రధానమంత్రిని కాదని సుబ్రమణ్య స్వామి వివరణ ఇచ్చారు. ముందు ఆరోగ్యశాఖ మంత్రిని తీసేయాలని ఓ వ్యక్తి చేసిన కామెంట్ పై స్వామి స్పందించారు. హర్షవర్దన్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని చెప్పారు. ఆయన పూర్తి అధికారం చెలాయించలేక పోతున్నారని చెప్పారు. గడ్కరీతో కలిసి పనిచేస్తే ఆయన విజయవంతం అవుతారని చెప్పారు. కరోనాతో దేశం ఇబ్బంది పడుతున్న వేళ సుబ్రమణ్య స్వామి కామెంట్స్ సంచలనంగా మారాయి.