ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాజీనామా..!

ఐపీఎస్ అధికారి…తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. గురుకులాల కార్యదర్శి పదవితోపాటు…ఐపీఎస్ సర్వీసుకు కూడా రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖను పంపించారు ప్రవీణ్ కుమార్. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
రాజీనామా విషయాన్ని ప్రవీణ్ కుమార్ ట్విటర్ లో వెల్లడించారు. అదే విధంగా…ప్రజలకూ ఓ లేఖ రాశారాయన. తాను 26 సంవత్సరాలుగా ఈ సర్వీసులో కొనసాగానని…పలు హోదాల్లో పనిచేశానని చెప్పారు. ఇంకా ఆరు సంవత్సరాలు సర్వీసు ఉందని…తన వ్యక్తిగత కారణాలవల్లే రాజీనామా చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఇకపై తన మనసుకు నచ్చినవిధంగా…ఇష్టమైన పనులను నిర్వహించేందుకే వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనించాల్సిన అంశంగా చెప్పొచ్చు.
ఇప్పటి నుంచి బాబాసాహెబ్ అంబేద్క్ మహాత్మ జ్యోతిరావు పూలే, కాన్షీరాం మార్గంలో తాను నడుస్తానని భావితరాలను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రవీణ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. గురుకులాల కార్యదర్శిగా స్వేరోస్ నిర్వహణలో ప్రవీణ్ కుమార్ ఎంతో ప్రగతిని సాధించారు. ఎంతో మంది మన్ననలు సైతం అందుకున్నారు. అయితే పలు వివాదాలు ప్రవీణ్ కుమార్ ను చుట్టుముట్టాయి.
ఓ వర్గంపై ప్రవీణ్ కుమార్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మధ్యే జరిగిన ఓ కార్యక్రమంలోఅక్కడి నిర్వహకులు అంబేద్కర్ ప్రతిజ్ణ చేశారు. అక్కడే ఉన్న ప్రవీణ్ కుమార్…ఆ ప్రతిజ్ణలో హిందూ మతానికి సంబంధించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రవీణ్ కుమార్ స్పష్టతనిచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా రాజీనామా చేయడం సంచలనంగా మారింది.