New viruses : మూడు వారాల్లో మరిన్ని కొత్త వైరస్ లు పుట్టుకొచ్చే ప్రమాదం.

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత ఏడాది మొదటి వేవ్ సమయంలో కరాళ నృత్యం చేసిన కరోనా, ఇప్పుడు సెకండ్ వేవ్ లో డబుల్ డేంజర్ లా మారింది. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్, కోవిడ్-19 మేనేజిమెంట్ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యులు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఇప్పటికే, సెకెండ్ వేవ్ ఈ నెలలో తారాస్థాయికి చేరుకుంటుందని గతంలోనే సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభావాన్ని బట్టి లాక్‌డౌన్ అవసరం ఉందని… ప్రజలు వీలైనంత వరకూ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. అటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, యూపీల్లో కరోనా కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఢిల్లీలో ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించగా, యూపీలో కూడా వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు మాస్క్‌లు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించక పోవడం ఆందోళన కరంగా మారింది. కరోనా మహమ్మారి రెండో దశలో ర్యాపిడ్ స్పీడ్‌తో విజృంభిస్తున్నది.
ఇదిలా ఉంటే తాజాగా దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్ మ్యూటేషన్లు విజృంభించే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) అప్రమత్తం చేసింది. వచ్చే మూడు వారాలు భారత్‌కు చాలా కీలకం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం పాటించాలని సంస్థ డైరెక్టర్ రాకేశ్‌మిశ్ర సూచించారు.
అంతేకాదు దేశంలో గడిచిన 24 గంటల్లో రెండున్నర లక్షలపైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంటే వీటి వెనుక కచ్చితంగా కొత్తరకం కరోనా వైరస్ హస్తం ఉండే ఉంటుందని ఆయన అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల నుంచి వైరస్ జన్యుక్రమం ఆవిష్కరించే పరిశోధనలు సాగుతున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డా.రాకేశ్‌మిశ్ర తెలిపారు.
అలాగే అక్టోబర్ నెలలోనే కొత్త రకం వైరస్ బి.1.617 రకం వెలుగులోకి వచ్చిందని, అప్పుడు కోవిడ్ నిబంధనలు స్ట్రిక్ట్ గా ఉన్న కారణంగా, పెద్దగా వ్యాప్తి చెందలేదని, అయితే ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అటకెక్కడంతో పరిస్థితి విషమించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే 3 వారాలు చాలా కీలకమని, లేకుంటే మరిన్ని కొత్త వైరస్ స్వరూపాలు ఉద్భవించే ప్రమాదం ఉందని మిశ్రా హెచ్చరించారు.