Pure Love: పసిడికన్నా…. స్వచ్ఛమైన ప్రేమే విలువైనది!

సమాజంలో లింగ వివక్ష అనేది పాతుకుపోయింది. ఒకప్పుడు ప్రాచీన కాలంలో లేని పోకడలు సైతం ఇఫ్పుడు చాదస్తాలుగానూ, సంప్రదాయాలుగానూ చెలామణిలోకి వస్తున్నాయి. ఒకప్పుడు భారతీయ సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది శాస్త్రాల నుంచే అంతర్భాగంగా ఉండేది. దేవాలయాల్లోని శిల్పాల్లో సైతం లైంగిక భంగిమలను ఏర్పాటు చేసి, శృంగారం జీవితంలో ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో మన పెద్దలు వివరించారు. కానీ మధ్యయుగంలో సాంప్రదాయాలు, ఆచారాల మాటున వచ్చిన చాదస్తాలు భారతీయ సమాజానికి మాయని మచ్చలా తయారు అయ్యాయి. అలాంటిదే థర్డ్ జెండర్ పట్ల సమాజంలో ఉన్నటువంటి చిన్నచూపుగా గుర్తించవచ్చు. మనసమాజంలో థర్డ్ జెండర్ పట్ల మొదటి నుంచి అవగాహన ఉంది. పురాణాల్లో సైతం వారి హక్కులను గుర్తించిన చరిత్ర మనకు ఉంది. ఒకానొక సమయంలో లైంగిక స్వేచ్ఛ విషయంలో కూడా మన సమాజం చాలా హేతుబద్ధంగా ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మన సమాజంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్ సమస్య చాలా తీవ్రంగా మారింది. మన న్యాయ వ్యవస్థ సైతం ట్రాన్స్ జెండర్ల హక్కులను గుర్తించడమే కాదు. వారిని వైపు న్యాయాన్ని గుర్తించి హక్కుల విషయంలో కేంద్రానికి పలు సూచనలు చేసింది. అయితే ఇప్పటికీ సమాజంలో చిన్నచూపుకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ల సమస్యపై ఇటీవల విడుదలైన భీమా జువెలరీ వారు విడుదల చేసిన ఓ వాణిజ్య ప్రకటన ఎంతో మందికి కనువిప్పు కలిగించేలా ఉంది.
ట్రాన్స్ జెండర్ల మనస్సును గుర్తించిన ఓ కుటుంబం, వారి ఇష్టాలను గుర్తెరిగి అందుకు అనుగుణంగా నడుచుకోవడం చాలా మందిని కదిలించింది. ఓ ట్రాన్స్ జెండర్ అంతరంగాన్ని గుర్తించిన తల్లిదండ్రులు, వారి తోబుట్టువులు, వారి ఇష్టాన్ని గుర్తించి వేషధారణలోనూ వారికి సహకరించి, చివరకు తమ నిజమైన ప్రేమను చాటుకోవడం, ఈ వాణిజ్య ప్రకటనలో సారాంశం. సమాజంలో గూడు కట్టుకున్న కొన్ని సంకుచిత భావాలకు ఈ వాణిజ్య ప్రకటన ఓ గుణపాఠం అనే చెప్పాలి. బిడ్డల మనస్సును గుర్తించి అందుకు తగినట్లు నడుచుకోవడం తల్లిదండ్రుల బాధ్యతగా, చాలా సున్నితంగా చూపడం ఈ వాణిజ్య ప్రకటనలోని గొప్పతనం. మొత్తానికి భీమా జువెలరీ యాడ్ ఎంతో మంది నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.