ఏపీలో పగటి పూట కర్ఫ్యూఅమలు.. అంతరాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర భారీగా వాహనాల నిలిపివేత.. తెలంగాణలో పూర్తిస్థాయి లాక్ డౌన్ ఉండదన్న సీఎస్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ సర్కారు తీసుకున్న పగటి పూట కర్ఫ్యూ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతోంది. మహమ్మారికి అడ్డుకట్ట వేయడమే టార్గెట్ గా మధ్యాహ్నం 12 గంటల నుంచి పగటిపూట కర్ఫ్యూను సర్కారు అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్ అమలు కానుంది. ఈ ఆంక్షలు 2 వారాలపాటు కొనసాగుతాయి. సర్కారు నిర్ణయంతో ఏపీలో 12 గంటల వరకే వ్యాపార సముదాయాలు మూత పడ్డాయి. ప్రజా రవాణా నిలిచిపోయింది. కర్ఫ్యూ సమయంలో వాహనాలు తిరగకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. సర్కారు మినహాయింపు ఇచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్న వారు తప్ప మిగతా వ్యక్తులు బయట తిరగడానికి వీళ్లేదని సర్కారు ఆదేశాలు జారీచేసింది.
అటు ఏపీలోకి ప్రవేశించే అంతరాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఏపీలోకి ప్రవేశించే వాహనాలను అక్కడి పోలీసులు నిలిపివేస్తున్నారు. గరికపాడులోని ఏపీ-తెలంగాణ చెక్ పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి. అనుమతులు ఉన్న వాహనాలను ఏపీ లోకి అనుమతిస్తున్నారు. అనుమతులు లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను, ఇతర వాహనాలను సైతం పూర్తిగా నిలిపివేస్తున్నారు. అత్యవసర, సరుకు రవాణా వాహనాలను మాత్రమే అలో చేస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ముందస్తు టికెట్ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లు రద్దు చేసింది. మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే గమ్యస్థానాలకు చేరుకునే బస్సులకే అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: ఆర్థిక వ్యవస్థ అదుపు తప్పుతోంది.. కరోనా కల్లోలం నేపథ్యంలో ఆర్బీ ఐ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఉండదని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. . హైకోర్టు సూచనలల మేరకు వీకెండ్ లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పూర్తి స్థాయి లాక్‌డౌన్ అవసరమైనప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. లాక్‌డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్సీజన్, బెడ్స్ కొరత లేదన్నారు.