Covid: మిల్కా సింగ్ ఇక లేరు…!

లెజెండ్ అథ్లెట్, మిల్కా సింగ్ ఇకలేరు. గత కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. చండీగఢ్ సెక్టార్ 8లోని ఆయన నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్న మిల్కా సింగ్ …ఆరోగ్యం మరింత క్షీణించడంతో అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. దీంతో క్రీడారంగం దిగ్గజ క్రీడాకారుడిని కోల్పోయింది. మిల్కాసింగ్ సతీమణి నిర్మల్ మిల్కా సింగ్ గత ఆదివారం కన్నుమూశారు. ఆమె కూడా కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇక ది ఫ్లయింగ్ సిక్కుగా పేరొందిన మిల్కా సింగ్ ఒలింపిక్ పతకం సాధించలేక పోయినప్పటికీ..తన కెరీర్ లో ఎన్నో మరపురాని పోటీల్లో పాల్గొన్నారు. 1960లో రోమ్ లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో 400మీటర్ల రేస్ అందరికీ గుర్తుండిపోయింది. పోటీల్లో నాల్గో స్థానంలో నిలిచారు. ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లలో మూడు సార్లు గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక అథ్లెట్ గా మిల్కా సింగ్ నిలిచారు.
1932 నవంబర్ 20 న పాక్ పంజాబ్ లోని గోవింద్ పురలో మిల్కాసింగ్ జన్మించారు. సిక్ రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన మిల్కా సింగ్ 1951 లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగులపోటీలో మిల్కాసింగ్ ఆరో స్థానంలో నిలిచారు. అనంతరంగా అథ్లెట్ గా మారారు. మిల్కా సింగ్ కు హైదరాబాద్ తో దగ్గరి సంబంధం ఉంది. సికింద్రాబాద్ లో మిల్కా సింగ్ తొమ్మిది సంవత్సరాలపాటు శిక్షణ పొందారు. తర్వాత 1958లో కామన్వెల్త్ పోటీల్లో బంగార పతకం గెలిచి సత్తా చాటాడు.
మిల్కా సింగ్ మరణంతో క్రీడాలోకం మూగబోయింది. మరణవార్త తెలియగానే ప్రధానిమంత్రి నరేంద్రమోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గొప్పవ్యక్తిని కోల్పోయమన్నారు. వారి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.