Covid curfew: రెండు వారాలపాటు కర్ఫ్యూ….నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజుకు దాదాపు 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మే రెండో వారం వరకు కరోనా కేసులు రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కర్నాటకలో రోజు దాదాపు పదివేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మంగళవారం రాత్రి 9 గంటల నుంచి రెండు వారాల పాటు కోవిడ్ కర్ఫ్యూ విధించనున్నట్లు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించారు. ఇక అత్యవసర సేవల కోసం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కర్య్ఫూను సడలించనున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా కర్ఫ్యూను నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవన నిర్మాణ రంగం, తయారీదారి రంగంతోపాటు వ్యవసాయ రంగ పనులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గడిచిన 24 గంటల్లో కర్నాటకలో 34వేల కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. 6వేల 9వందల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 143మంది మరణించారు. ఇక దాదాపు 2లక్షల కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 14వందల మంది కరోనాతో మరణించినట్లు చెప్పారు.