Corona: సీఎం కేసీఆర్‌కు కరోనా…కొంప ముంచిన సాగర్ ఎన్నికల ప్రచార సభ…

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే పలువురు ప్రముఖుల కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చీఫ్ సెక్రటరీ సోమవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రాపిడ్ యాంటిజెన్ టెస్టులో కేసీఆర్ కు కోవిడ్ కు సంబంధించిన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని, వైద్యుల సూచన మేరకు ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు. అయితే కేసీఆర్‌కు జలుబుతో పాటుగా జ్వరం 99.4 డిగ్రీల సెల్సియస్ ఉందని కేసీఆర్ వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.
ఇదిలా ఉంటే నాగార్జునసాగర్ శాసనసభకు జరిగిన ఉప ఎన్నిక కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కరోనా వైరస్ సోకినట్లు అంచనా విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా విస్తరిస్తున్న పరిస్థితిలో లక్ష మందితో కేసీఆర్ సభ ఎలా పెడుతారని ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అయితే కేసీఆర్ మాత్రం బెంగాల్ లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభల్లో పాల్గొనలేదా, తాను పాల్గొంటే తప్పేం ఉందని ఎదురుదాడి చేశారు.
అయితే అటు కరోనా సెకండ్ వేవ్ గురించి రాష్ట్ర వైద్య సంచాలకులు గడల శ్రీనివాసరావు గాలి ద్వారా కరోనా విస్తరిస్తోందని హెచ్చరించినా, నిబంధనలను బేఖాతరు చేస్తూ కేసీఆర్ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచార సభలో పాల్గొన్నారు. అయితే సాగర్ సభలో పాల్గొని అనారోగ్యం పాలైన వారిలో ఇటీవల కొంత మందికి టెస్టులు చేయగా 136 మందికి కరోనా సోకిందని తేలింది. సాగర్ సభ కరోనా వ్యాప్తికి సూపర్ స్ప్రెడర్ గా నిలిచింది. ఈ సభలో దాదాపు 50 వేలకు మంది పైచిలుకు ప్రజలు హాజరైనట్లు తేలింది. దీంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు కరోనా పాజిటివ్ రావడం కూడా సభ సృష్టించిన విలయం ఎలాంటిదో తెలియజేస్తుంది. అంతేకాదు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ, పోలింగులోనూ కరోనా వైరస్ వ్యాపించినట్లు భావిస్తున్నారు. టీఆర్ఎస్ నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ సోకింది. అలాగే సభలో పాల్గొన్న మరో కీలక టీఆర్ఎఎస్ నేత కోటిరెడ్డికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. బిజెపి, కాంగ్రెసులకు చెందిన పలువురు నాయకులకు కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.