Covid Horror : శవ జాగారం…కరోనా మృతుల కుటుంబాలకు నరక యాతన..స్మశానాలు హౌస్ ఫుల్..

కరోనా కేసుల్లో మరణం సంభవిస్తే చాలా హృదయ విదారకంగా పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా స్మశానాల్లో అంత్యక్రియలు సైతం గౌరవంగా జరుపుకోలేని పరిస్థితి సన్నిహితులను కలిచివేస్తోంది. తాజాగా ఢిల్లీ, ముంబై, నాగపూర్, అహ్మదాబాద్ లలో స్మశానాలకు తరలివస్తున్న అంబులెన్సుల దృశ్యాలను చూస్తే గుండెతరుక్కుపోవడం ఖాయం. ఎందుకంటే ఇటువంటి దృశ్యం మనుపెన్నడు చూడలేము. తాజాగా హైదరాబాద్ స్మశాన వాటికల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. దహనవాటికల్లో లైన్లు కట్టి మరీ స్మశానాల్లో దహన ప్రక్రియ జరుపుతున్నారు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆసుపత్రిలో రోగి మరణిస్తే అక్కడే అంత్య క్రియల ప్యాకేజీలో భాగంగా అంబెలెన్సు, అలాగే దహన క్రియల కోసం 30 వేల నుంచి 35 వేల వరకూ వసూలు చేస్తున్నారు అంటే పరిస్థితి ఎలా మారిందో తెలుసుకోవచ్చు. ఇక కరోనా కేసుల్లో సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.
హైదరాబాద్ లోని ప్రముఖ స్మశాన వాటిక అయిన మహాప్రస్థానంలో శవాలు వస్తూనే ఉన్నాయని, సాధారణంగా సాయంత్రం గడిచిన తర్వాత శవదహనం చేయకూడదని, కానీ సమయం లేకపోవడంతో రాత్రిళ్లు కూడా శవ దహనం చేయాల్సి వస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే శవదహనాల కోసం కట్టెలు సరిపోక పోవడంతో చాలా మంది ఎలక్ట్రిక్, గ్యాస్ దహనానికి మొగ్గు చూపుతున్నారని, కానీ ఎలక్ట్రిక్ దహన వాటికకు తాకిడి పెరగడంతో, వెయిటింగ్ పీరియడ్ పెరుగుతోందని, నిర్వాహకులు చెప్పుకొచ్చారు.
ఇక కొన్ని సందర్భాల్లో కోవిడ్ శవాల వెంట బంధుజనం ఎవరూ రాకపోవడంతో అంబులెన్సులోనే అపర కర్మలు చేసి, అంబులెన్సు డ్రైవర్ కు బాధ్యత అప్పగించి, శవంచితిపై చేరే సమయంలో ఫోన్ చేయమని చెప్పి, వారి వారసులు వేచి ఉండలేక, ఇతర పనులు చేసుకొని చివర్లో వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి తమ జీవితంలో చూడలేదని, కాటికాపరులు వాపోవడం గమనార్హం.