BLOOD SHORTAGE: తలసేమియా బాధితులపై కరోనా ఎఫెక్ట్.. వ్యాక్సిన్ తర్వాత 2 నెలలు బ్లడ్ డొనేషన్ వద్దంటున్న డాక్టర్లు.. రక్త విపత్తుతో అల్లాడుతున్న చిన్నారులు

రాష్ట్రంలో రక్త నిల్వలపై కరోనా దెబ్బ పడింది. గతంలో అవసరానికి మంచి ఉన్న రక్తపు నిల్వలు ప్రస్తుతం అడుగంటాయి. కోవిడ్ భయంతో రక్త దాతలు వెనుకంజ వేస్తున్నారు. కరోనా నిబంధనల కారణంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కొనసాగడం లేదు. దీంతో రక్త సేకరణ సగానికిపైగా పడిపోయింది. అవసరానికి తగిన రక్తం దొరకక బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 132 బ్లడ్ బ్యాంకులు నడుస్తున్నాయి. వీటి నుంచి ఏటా 1.20 నుంచి 1.50 లక్షల యూనిట్ల రక్తం అందిచేది. గతంలో అవసరానికి మించి ఏటా రెండు లక్షలకుపైగా యూనిట్ల రక్తం సేకరించేవారు. రాష్ట్ర వ్యాప్తంగా సరిపడా రక్త నిల్వలు ఉండేవి. గతేడాది లాక్ డౌన్ పెట్టిన దగ్గర నుంచి రక్త సేకరణ భారీగా తగ్గింది. ఏడాది కాలంలో కేవలం 90 నుంచి 95 వేల యూనిట్లు మాత్రమే రక్తం సేకరణ జరిపినట్లు అధికారులు తెలిపారు. రక్త లోటును భర్తీ చేసుకునేందుకు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. అటు రక్తం లభించక తలసేమియా బాధితులు అరిగోస పడుతున్నారు.
అటు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారితో పాటు కోవిడ్-19 నుంచి కోలుకున్నవారు కనీసం రెండు నెలలు రక్తదానం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇప్పటికే 45 ఏండ్లు నిండిన వారికి కరోనా టీకాలు వేశారు. వారంతా రక్త దానానికి దూరం అయ్యారు. ప్రస్తుతం 18 ఏండ్లు నిండిన వారు సైతం టీకాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే కొద్ది నెలల పాటు తీవ్ర రక్త కొరత ఏర్పడే అవకాశం ఉంది. తలసేమియా బాధితులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీకా వేసుకోక ముందే ప్రజలు రక్తదానం చేయాలని వైద్యులు కోరుతున్నారు.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో 2 వేల 950 మంది పిల్లలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. వారికి నెలకు 2వేల యూనిట్ల రక్తం అవసరం పడుతుంది. ప్రస్తుతం రక్త దాతలు సగానికి పైగా తగ్గిపోయారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే.. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఉన్నట్టు.. రాబోయే రోజుల్లో రక్త విపత్తు ఏర్పడి పిల్లలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఆందోళలన వ్యక్తం అవుతోంది.