Sagar by poll: సాగర్ ఉపఎన్నికపై బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదే!

నాగార్జున సాగర్ ఉపఎన్నికపై బిజెపి నజర్ పెట్టింది. గెలుపుపై ఆశాలు తక్కువగా ఉన్నా కూడా ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది.
బిజెపి నాగార్జున సాగర్ పై పట్టు బిగిస్తోంది. బలమైన టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పోల్చినట్లయితే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ…వెనక అడుగు వేయకుండా…మనస్పూర్తిగా…ముందుకు వెళ్లి పోరాడాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ నాయకులతో సహా తన తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లందర్నీ సాగర్ ప్రచారానికి రప్పించాలని తాజాగా నిర్ణయించింది పార్టీ. మంగళవారం దాదాపు మూడు గంటలకు పైగానే సమావేశమైన బీజేపీ కోర్ కమిటీ సాగర్ ఉపఎన్నిక ప్రచారంపై రూట్ మ్యాప్ రెడీ చేసింది. భారీ బహిరంగ సభలకు బదులుగా చిన్నగా గ్రామస్థాయి సమావేశాలను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. అలాగే పార్టీ ప్రచారం కోసం నేతలకు చెందిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఐదు పోలింగ్ బూత్లకు ఒకటి చొప్పున మీటింగ్ నిర్వహించాలని…బీజేపీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యతను రాష్ట్ర స్థాయి నాయకులకు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు రాష్ట్ర నాయకులంతా కూడా నాగార్జునసాగర్ లోనే ఉండి స్థానిక కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగాలని సూచించింది. సాగర్లో పనిచేసే స్టార్ క్యాంపెయినర్లతో కోర్ స్ట్రాటజీ బ్రుందం చర్చించి తుది నిర్ణయం తీసుకుంది.
ఇక రవినాయక్ కు పార్టీ టికెట్ ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్న పార్టీ రెబల్ అభ్యర్థి నివేదారెడ్డిని కలుపుకుని ముందుకు సాగాలని బీజేపీ భావిస్తోంది. అయితే నివేదాతోపాటు ఆమె భర్త శ్రీధర్ రెడ్డి ఇప్పటికే బీజేపీ తరపున జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వీరి ప్రచారం పార్టీ అవకాశాలను మరింత పెంచుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.