దేశంలో తొలిసారి జంతువులపై కరోనా ఎటాక్.. హైదరాబాద్ జూపార్కులో 8 సింహాలకు పాజిటివ్.. ఐసొలేషన్‌కు మృగరాజుల తరలింపు

ఇప్పటి వరకు మనుషులపై దాడి చేసిన కరోనా రక్కసి తాజాగా జంతువులపై పడింది. తాజాగా హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో 8 ఆసియాటిక్ సింహాలకు వైరస్ సోకింది. జంతువులపై కరోనా సోకడం దేశంలోనే ఇదే తొలిసారి. కోవిడ్ వచ్చిన సింహాలను జూలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌లో ఉంచారు. వాటికి ప్రత్యేక ఆహారం అందిస్తున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు వాటి పరిస్థితిని గమనిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా జూలోని సింహాలు శ్వాస సంబంధిత ఇబ్బందితో బాధ పడుతున్నాయి. జలుబు కూడా చేసినట్లు అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు సింహాల లాలాజలాన్ని ల్యాబరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్‌డేంజర్డ్ స్పీసీస్-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి పంపించారు. అక్కడ టెస్టులు చేయగా.. కరోనా సోకినట్లు గుర్తించారు. వీటికి సోకిన వైరస్ సార్స్ కోవ్-2 రకానికి చెందినదని అధికారులు వెల్లడించారు.
జూలో పనిచేసిన వారి నుంచే సింహాలకు కరోనా సోకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సింహాలు ఆరోగ్యంగా ఉన్నాయని జూ అధికారులు తెలిపారు. జూలోని ఇతర జంతువులకు కరోనా సోకకుండా శానిటేషన్ చేసినట్లు చెప్పారు. జూలో మొత్తం 11 ఆసియాటిక్ సింహాలు ఉన్నాయి. ప్రస్తుతం జూలోకి సందర్శకులను అనుమతించడం లేదు. కరోనా తొలివేవ్ లో న్యూయార్క్ బ్రాంజ్ జూలో పెద్దపులికి కరోనా సోకినట్టు గుర్తించారు. మనదేశంలో ఇదే తొలిసారి.
One thought on “దేశంలో తొలిసారి జంతువులపై కరోనా ఎటాక్.. హైదరాబాద్ జూపార్కులో 8 సింహాలకు పాజిటివ్.. ఐసొలేషన్‌కు మృగరాజుల తరలింపు”