hyderabad metro : మెట్రో ఉద్యోగుల మెరుపు సమ్మె

ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైల్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. ఐదేళ్లుగా తమకు జీతాలు పెంచకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆరోపించారు. తక్షణమే తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. దీనిపై స్పందించిన హైదరాబాద్ మెట్రో రైలు మేనేజ్‌మెంట్ తొలుత తీవ్ర హెచ్చరికలు జారీ స్పందించింది. అయినప్పటికీ ఉద్యోగులు మెట్టు దిగలేదు. దీంతో వారి సమస్యలపై చర్చించేందుకు యాజమాన్యం దిగివచ్చింది.
ఉదయం మెరుపు సమ్మె
2017 చివర్లో హైదరాబాద్ మెట్రో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. అందులో చాలా మంది ఉద్యోగులు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే నియామకమయ్యారు. ఐదేళ్లుగా కేవలం 11 వేల రూపాయల నెల జీతం మాత్రమే తమకు కంపెనీ చెల్లిస్తోన్నట్లు ఉద్యోగులు తెలిపారు. కనీసం 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకూ జీతం పెంచాలని వారు డిమాండ్ చేశారు. నిర్ణీత పని సమయం లేవని, కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడంలేదని ఆరోపించారు. సిబ్బంది కొరత కూడా తమకు ప్రతికూలంగా మారిందని, పని భారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
ప్రయాణీకులకు తప్పని తిప్పలు
మెట్రో ఉద్యోగులు సమ్మెతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధుల బహిష్కరణ చేపట్టారు. మీయాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ మెట్రో స్టేషన్‌లలో టికెట్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో మెట్రో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాజమాన్యం అప్పటికప్పుడు కొంతమందితో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ప్రయాణీకులు ఎల్బీనగర్, అమీర్‌పేట్, కూకట్ పల్లి, మియాపూర్ తదితర మెట్రో స్టేషన్‌లలో.. టికెట్ల కోసం ప్రయాణికులు బారులుతీరారు.
సమ్మె హక్కు లేదన్న యాజమాన్యం
సమ్మెకు దిగిన ఉద్యోగుల పట్ల యాజమాన్యం సీరియస్ గానే స్పందించింది. అసలు మెట్రో ఉద్యోగులకు సమ్మె చేసే అర్హత లేదని తేల్చి చెప్పింది. కాంట్రాక్టింగ్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న టిక్కెటింగ్ సిబ్బంది కావాలనే సమ్మెకు దిగినట్లు ఆరోపించింది. ప్రయాణీకులకు అసౌకర్యాన్ని కలిగించొద్దని హెచ్చరించింది. మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం కలిగించే దురుద్దేశ్యంతోనే సమ్మెకు దిగినట్టు విమర్శించింది. తమ స్వార్థ ప్రయోజనం కోసం తప్పుడు సమాచారాన్ని, పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. సమ్మెపై వాదనలు తప్పని సూచించింది. ఉద్యోగుల చర్యలు ప్రజా ప్రయోజనాలకు పూర్తి విరుద్ధమంది. సమ్మెకు దిగిన ఉద్యోగులపై కఠిన చర్యలను తీసుకోవాల్సిందిగా హెచ్‌ఎంఆర్ యాజమాన్యం కోరుతోందని ప్రకటించింది.
సమయానికే మెట్రో సేవలు
హైదరాబాద్ మెట్రో రైలు కార్యకలాపాలు నిర్ధేశిత సమయానికే నడుస్తున్నాయని యాజమాన్యం ప్రకటించింది. టికేటింగ్ సిబ్బంది సమ్మెకు దిగినప్పటికీ తగిన సిబ్బంది కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నారంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇక సమ్మెల మెట్రోలో పని చేస్తున్న సిబ్బందికి తగిన వసతులు, ప్రయోజనాలను మేనేజ్‌మెంట్ అందిస్తుందని తెలిపింది. అయితే సమ్మె చేస్తున్న వారు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందంది. సమ్మె చేస్తున్న వారితో తగిన చర్చలు జరుపనున్నట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది.