India won t20 match : టీమిండియా శుభారంభం

2023 కొత్త సంవత్సరాన్ని టీమిండియా విజయంతో ప్రారంభించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో 2 పరుగుల తేడాతో విజయదుందుబి మోగించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 162 పరుగులకు ఆలౌటైంది. కాగా 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీం ఇండియా 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. టీం ఇండియా బౌలర్లలో శివమ్ మావి 4 వికెట్లు, ఉమ్రాన్, హర్షల్ చెరో 2 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. తొలి మ్యాచ్ లోనే 4 వికెట్లు పడగొట్టిన శివం మావి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ శనక తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ ప్రారంభంలో టీమిండియా తడబడింది. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో భారత్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ ఇషాన్ తొలి ఓవర్ నుంచే లంక బౌలర్ల మీద విరుచుకపడ్డాడు. అయితే.. శుభ్‌మన్ గిల్ 7 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు చేసి వెంట వెంటనే అవుటయ్యారు. మరోవైపు సంజూ శాంసన్ కూడా 5పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పరిచాడు. దీంతో భారత్ పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఇదే సమయంలో రంగ ప్రవేశం చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇషాన్ కూడా పాండ్యాకు తోడవడంతో లంక బౌలర్లను ఆడేసుకున్నారు. దూకుడుగా ఆడుతున్న క్రమంలో ఇషాన్ 37 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ వెంటనే పాండ్యా కూడా 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన ఆల్‌రౌండర్లు దీపక్ హుడా 41పరుగులు, అక్షర్ పటేల్ 31పరుగులతో చెలరేగిపోయారు. వీళ్లిద్దరూ 5వ, 6వ వికెట్‌కు విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశారు. వీరి దూకుడైన ఆటతోనే టీమిండియా 20 ఓవర్లకు 162 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మధుషనక, తీక్షణ, కరుణరత్నే, డిసిల్వా, హసరంగ తలో వికెట్ తీశారు.
మ్యాచ్ చివర్లో ఉత్కంఠత
భారత్ – శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ చివరి రెండు ఓవర్లు ఉత్కంఠభరితంగా సాగాయి. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 19వ ఓవర్‌లో హర్షల్ పటేల్ ఏకంగా 16 పరుగులు ఇచ్చాడు. దీంతో శ్రీలంక బ్యాట్స్ మెన్ కు చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరి ఓవర్ వేసిన అక్షర్ పటేల్ తొలి 5 బంతులకు 10 పరుగులు ఇచ్చేశాడు. ఈ క్రమంలో చివరి బంతికి 3 పరుగులు చేయాల్సి ఉండగా కసున్ రజిత రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 2023 సంవత్సరంలో తన జైత్రయాత్రను ఘన విజయంతో మొదలుపెట్టినట్లైంది.