India vs Sri Lanka 2nd T20: కాసేపట్లో భారత్ – శ్రీలంక మధ్య టీ20 సమరం

పుణె వేదికగా ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్ కు భారత్, శ్రీలంక జట్లు సమాయత్తం అవుతున్నాయి. సాయంత్రం ఏడు గంటలకు జరగనున్న పోరులో విజయం సాధించడానికి ఇరు జట్లు ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా చూడ చక్కటి విజయాన్ని అందుకుంది. దీంతో రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తొలి మ్యాచ్ విజయంతో ఆత్మవిశ్వాసం నింపుకున్న భారత జట్టు సిరీస్ గెలుపే లక్ష్యంగా శ్రీలంకతో జరిగే రెండో టీ20కి సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్ లో హార్దిక్ సారథ్యంలోని భారత జట్లు ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. అయితే టాపార్డర్ బ్యాటర్లు విఫలమవడంపై కలవర పడుతోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నుంచి భారత అభిమానులు భారీ ఇన్నింగ్స్ లను కోరుకుంటున్నారు. పుణె మ్యాచ్‌లో భారీస్కోరు చేయడం ద్వారా గిల్ తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. శుభ్‌మన్, ఇషాన్ కిషన్ లు ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఇక వైస్-కెప్టెన్ సూర్యకుమార్ పై కూడా అభిమానులు భారీ అంజనాలు పెట్టుకున్నారు.
ఇక టీమిండియా స్పీడ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తొలి మ్యాచ్ లో పదునైన బంతులు సందించాడు. సుమారు 155 కిలో మీటర్ల వేగంతో అతడు వేసిన బంతుల ముందు శ్రీలంక బ్యాట్స్ మెన్ నిలబడలేకపోయారు. ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శనను ప్రశంసిస్తూ భారత క్రికెట్ కౌన్సిల్ ట్విట్టర్ వేదికగా ప్రత్యేక ప్రశంసలు కురిపించింది. పుణె మ్యాచ్ లోనూ ఉమ్రాన్ మాలిక తన ప్రదర్శనను కొనసాగిస్తాడని ప్రకటించింది. దీంతో ఇవాళ్టి తుది జట్టులో ఉమ్రాన్ మాలిక్ స్థానం కొనసాగుతుందని తేల్చేసింది.
మరోవైపు తొలి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ సందర్భంగా మోకాలికి గాయం కావడంతో అతడు రెండో టీ20కి దూరమయ్యాడు. గాయం కారణంగానే అతడు పుణె వెళ్లకుండా ముంబైలోనే ఉండిపోయాడని బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి. దీంతో విదర్భ వికెట్ కీపర్ జితేష్ శర్మను సంజూ స్థానంలో జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. మరో వైపు జ్వరంతో తొలి టీ20 మ్యాచ్ కి దూరమైన అర్ష్‌దీప్ కోలుకున్నాడు. ఇక లెగ్ స్పిన్నర్ చాహల్ కూడా చెలరేగితే లంక బ్యాట్స్ మెన్ కి తిప్పలు తప్పవంటున్నారు క్రికెట్ విశ్లేషకులు
ఇక రెండో టీ20కి అతిథ్యం ఇస్తున్న పుణె పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ పిచ్ పై జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా విజయం సాధించాయి. మరోవైపు మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవడంతో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.