CHINA SPACE CENTER: ఐఎస్‌ఎస్‌కు ధీటుగా టియాన్‌హే.. సొంత అంతరిక్షం కేంద్రం ఏర్పాటు దిశగా చైనా కీలక ముందడుగు!

డ్రాగన్ కంట్రీ చైనా ప్రతీ అంశంలో తన మార్క్ ముద్రను చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అంతరిక్షం మొదలుకుని సముద్రం వరకు.. కరెన్సీ మొదలుకొని సెర్చింజన్ వరకు ప్రతి విషయంలో ప్రత్యేకతను చాటుకుంటోంది. గూగుల్‌ను కాదని.. సొంతంగా బైడూ సెర్చ్ ఇంజిన్ ను తీసుకొచ్చింది. ప్రపంచ దేశాలను అశ్చర్య పరిచింది. తాజాగా అంతరిక్షంలో తన ప్రత్యేకతను చాటుకునేందుకు అడుగులు వేస్తోంది. ప్రపంచ దేశాలను కాదని సొంతంగా స్పేస్ ష్టేషన్ నిర్మించేందుకు సమాయత్తం అవుతోంది. ప్రపంచంలోని ఐదు అగ్రదేశాలు కలిసి దశాబ్దాలపాటు నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని.. ఒంటరిగా కట్టేందుకు చైనా కీలక అడుగులు వేసింది.
ఇప్పటి వరకు అంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహాల పర్యవేక్షణ, వాటి రిపేర్లు, వ్యోమగాము నివాసం సహా పలు అవసరాల కోసం ఐఎస్‌ఎస్‌ను నిర్మించారు. 20 నవంబర్, 1998లో ఐఎస్‌ఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఎస్‌ఎస్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాసా (అమెరికా), రోస్కోస్‌మాస్ (రష్యా), జాక్సా (జపాన్), ఈఎస్‌ఏ (ఐరోపా), సీఎస్‌ఏ (కెనడా) స్పేస్ ఏజెన్సీలు దానిపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. చైనా చేపట్టే ప్రయోగాలు, ఉపగ్రహాల మరమ్మత్తులు, మానవసహిత యాత్రలపై ఆ దేశాలు పలు ఆంక్షలు పెడుతున్నాయి. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వకుండా చైనా ఏకపక్షంగా ప్రయోగాలు చేస్తున్నదని ఆయా దేశాలు ఆరోపిస్తున్నాయి. వాటి పెత్తనాన్ని భరించడం కంటే సొంతంగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిదని భావించింది.
తమ ఉపగ్రహాలకు సంబంధించిన మరమ్మత్తులు సహా మిగతా అంశాలను పర్యవేక్షించేందుకు సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. టియాన్‌హే అనే పేరుతో సొంతగా అంతరిక్ష కేంద్రానికి రూపకల్పన చేసింది. 11 మిషన్లతో రూపొందించే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో తాజాగా తొలి ప్రయోగాన్ని పడుతున్నారు. దక్షిణ చైనాలోని హైనాన్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా టియాన్‌హే నిర్మాణానికి అవసరమైన ఎక్యుప్ మెంట్ తీసుకెళ్లనున్నారు. 357.6 అడుగుల పొడవున్న ఐఎస్‌ఎస్‌తో పోలిస్తే టియాన్‌హే సైజు సుమారు 82 అడుగులు చిన్నగా ఉన్నా టెక్నాలజీ, సేవల విషయంలో ఐఎస్‌ఎస్‌కు ఇది ఏ మాత్రం తీసిపోదని చైనా వెల్లడించింది. టియాన్‌హే స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం 11 సార్లు రాకెట్ల ద్వారా సామగ్రిని తరలించనున్నారు. కనీసం 12 మంది వ్యోమగాములు ఇందులో ఉండేలా నిర్మాణం చేపడుతున్నారు. దీని సాయంతో మున్ముందు చేపట్టే అంగారక, చంద్రమండలంపై చేపట్టే ప్రయోగాలను దీని నుంచే మాననిటర్ చేయాలని భావిస్తోంది.