BRS KTR: బీఆర్ఎస్ లో కేటీఆర్ ఎక్కడ?

ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ తో జోరు పెంచారు. జాతీయ రాజకీయాలంటూ మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో పార్టీ ఆఫీసుకు శ్రీకారం చుట్టారు. ఇటు ఏపీలోనూ కాలు మోపుతానంటూ ఆంధ్రా నేతలను పార్టీలోకి తీసుకున్నారు. అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత కేటీఆర్ మాత్రం యాక్టివ్ గా కనిపించడం లేదు. అంతేకాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన బీఆర్ఎస్ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. దీనికి పలు రకాల కారణాలు లేకపోలేదు.
బీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగింది. ఆరోజు తప్ప బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కేటీఆర్ కనిపించలేదు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆయన హాజరు కాలేదు. ఒకవైపు కేసీఆర్ ఢిల్లీలో ఉండి పార్టీ కార్యాలయానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంటే, కేటీఆర్ మాత్రం హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యక్రమాలకు అతిరథ మహారథులు వచ్చినా, కేటీఆర్ రాకపోవడంపై అనేక రకాల వాదనలు వినిపించాయి.
తాజాగా ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు అండ్ టీమ్ ఇతర కీలక నాయకులు బీఆర్ఎస్ లో చేరుతుంటే కేటీఆర్ వస్తారని అందరూ అంచనా వేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ కు పార్టీ పరంగా అది కీలకమైన ప్రోగ్రామ్. స్వయంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చి తోట చంద్రశేఖర్ అండ్ టీమ్ ను సాదరంగా గులాబీదళంలోకి ఆహ్వానించారు. అయినా కేటీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. యువనేత వచ్చి నాలుగు మాటలు మాట్లాడి, ఏపీ క్యాడర్ లో జోష్ పెంచుతారని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. కానీ ఈ ప్రోగ్రామ్ కు కూడా కేటీఆర్ దూరంగానే ఉన్నారు.
బీఆర్ఎస్ కు కేటీఆర్ దూరంగా ఉన్నారా?
బీఆర్ఎస్ కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగా ఉండడంపై భిన్నరకాల వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో కీలకపదవి అప్పగించిన తర్వాతే కేటీఆర్ … బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కీలకంగా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గులాబీశ్రేణులు మాత్రం దీని వెనక ఎలాంటి వ్యూహం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ మధ్య కేటీఆర్ మామ కాలం చేశారు. దాని కారణంగానే పార్టీ కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగా ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కేసీఆర్ యాక్టివ్ గా ఉన్నారన్న భరోసాతోనే యువనేత రావడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
కేటీఆర్ కు యూత్ లో ఫాలోయింగ్!
ఎవరి వాదన ఎలా ఉన్నా కేటీఆర్ కు యూత్ లో ఫాలోయింగ్ ఉంది. మంచి మాటకారి. పైగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా మంచిపేరు తెచ్చుకున్నారు. పదునైన విమర్శలు, నవ్వులు పూయించే మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాంటి నేత బీఆర్ఎస్ లో కీలకంగా వ్యహహరిస్తే .. బీఆర్ఎస్ కు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీలో అది మరింత అడ్వాంటేజ్ అవుతుంది. ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలుసు. అయినప్పటికీ బీఆర్ఎస్ కార్యక్రమాలకు కేటీఆర్ రాకపోవడం కొంచెం అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది. దీని వెనక కారణం ఉన్నా లేకపోయినా యూత్ కు మాత్రం ఇది కొంచెం నిరాశపర్చే అంశమేనని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఆలోచనాధోరణిని పరిశీలిస్తే మాత్రం బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కేటీఆర్ ను కేసీఆర్ దూరం పెట్టే అవకాశమే లేదు. కాబట్టి త్వరలోనే కేటీఆర్.. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించే అవకాశాలే ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యువనేత కచ్చితంగా రావడమే కాదు, అవసరమైతే కీలక పదవిలో కేటీఆర్ ను చూసే అవకాశం కూడా లేకపోలేదన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది.