అభివృద్ధి దిశగా ఉత్తరాంధ్ర..జగన్ పాలనలో మారుతున్న ముఖచిత్రం…

ఏపీలో ఉత్తరాంధ్ర ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు వెనుకబాటుతనానికి మారుపేరుగా నిలిచిన ఉత్తరాంధ్రప్రాంతంలో ఇప్పుడు అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా విశాఖను ప్రకటించినప్పటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లా ప్రాంత ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా ఉండే అన్ని అర్హతలు విశాఖపట్నానికే ఉన్నాయని ఇప్పటికే, మేధావులు, పారిశ్రామిక వేత్తలు స్పష్టం చేశారు. రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ అమరావతి రాజధాని ఏర్పాటును తిరస్కరించింది. శాస్త్రీయంగా పరిపాలన వికేంద్రీకరణను సూచించింది.
అయితే అందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్వల్పకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హడావిడిగా అమరావతి నిర్మాణానికి పునాది వేశారు. చివరకు ఆ ప్రాంతంలో భూముల పందేరానికి తెరలేపారనే ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ కన్సల్టెన్సీ కంపెనీల ప్రతినిధులు సైతం అమరావతి మోడల్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అయితే ప్రస్తుతం సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన మూడు ప్రాంతాల ప్రజలకు సంతృప్తిని ఇస్తోంది. అంతే కాదు ఉత్తరాంధ్రప్రజల చిరకాల కోరిక కూడా తీరింది.
నిజానికి ఉత్తరాంధ్ర ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైంది. వెనుకుబాటుతనం, దారిద్య్రం, ఉపాధిలేమి ఆ ప్రాంతాన్ని సమస్యలుగా వేధించాయి. అయితే ఇప్పుడు అభివృద్ధి పుంజుకోవడంతో మూడు జిల్లాల ఉత్తరాంధ్ర ప్రజలు భవిష్యత్తుపై ఆశతో ఉన్నారు. సువిశాలమైన తీరప్రాంతం ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధికి దూరంగా ఉండటం వెనుక పాలకుల నిర్లక్ష్యం ఉందనే చెప్పాలి.
నిజానికి ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపంలో ఉంటుంది. ఇక్కడ వరి, సెనగ, రాగులు, ఆహారధాన్యాలను అధిక దిగుబడులు సాధిస్తూ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటున్నాయి. దాంతో పాటు వాణిజ్య పంటలైన చెరకు, పొగాకు, పత్తి, పసుపు, మిరప కూడా విస్తృతంగా సాగవుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఆహార తయారీరంగ పరిశ్రమలు నెలకొల్పితే స్థానికులు ఉపాధి అవకాశాలు కలగడంతోపాటు రైతులకు మద్దతు ధర లభిస్తుంది. ఇక్కడి పలాస ప్రాంతంలోని జీడిపప్పు దేశంలోనే ప్రసిద్ధి. జీడి, కొబ్బరి, పసుపు, చింతపండు స్థానికంగా ప్రాసెస్ చేసేందుకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాల్సిన ఆత్యవసరం ఉంది.
తాజాగా జగన్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్ పాలసీని అమలు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పూనుకుంది. అటు సంక్షేమ పథకాలు కూడా ఉత్తరాంధ్ర ప్రజల వెనుకబాటు తనాన్ని దూరం చేసేందుకు సహాయపడుతున్నాయి.