TS HIGH COURT ON SUNIL.. సునీల్ కనుగోలుకు హైకోర్టులో ఊరట

ఆలిండియా నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభంచింది. తెలంగాణ సైబర్ సెల్ ఇచ్చిన నోటీసుల విషయంలో ఎలాంటి అరెస్టులు వద్దని పోలీసులను ఆదేశించింది. అయితే విచారణ కోసం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని హైకోర్టు సూచించింది. నోటీసులపై ఎలాంటి స్టే ను ఇవ్వలేమని ధర్మాసనం.. అయితే ఈ నెల 18న జరగనున్న విచారణకు సహకరించాలని వ్యూహకర్త సునీల్ కనుగోలును ఆదేశించింది.
ఎవరీ సునీల్ కనుగోలు..?
కాంగ్రెస్ వ్యూహకర్తగా తెరపైకి వచ్చిన సునీల్ కనుగోలు తొలుత ప్రశాంత్ కిషోర్ కు చెందిన పొలిటికల్ స్ట్రాటజి సంసథ ‘ఐ-ప్యాక్’లో పని చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున నరేంద్రమోదీ గెలుపుకోసం పాటుపడ్డారు. అనంతరం ఐ – ప్యాక్ నుంచి విడిపోయి సొంతంగా పని చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే SK పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం రాహుల్ గాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన సునీల్ కనుగోలు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ కోర్ టీంలో భాగమయ్యారు. ప్రస్తుతం సునీల్ కనుగోలుకు చెందిన SK సంస్థ కర్నాటక, తెలంగాణతో పాటు దక్షిణ భారతీయ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ.. నేరుగా కాంగ్రెస్ అధిష్టానానికి నివేదికలు, వ్యూహాలు పంపుతోంది.
కేసీఆర్ పై మీమ్సే కారణమా..?
భారత యువకుడు, తెలంగాణ గళం పేరుతో సామాజిక మాధ్యమాల్లో పెట్టిన మీమ్స్, వీడియోల కేసుల్లో సునీల్ కనుగోలలు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ తోపాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఇతర టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ప్రభుత్వ విధానాలపై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ తుకారాంగేట్ కు చెందిన సామ్రాట్ అనే వ్యక్తి ఫిర్యాదుతో నవంబర్ 24న సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. మరో 5 కేసులు వివిధ ప్రాంతాల్లో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వీటిపై దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలతో పోలీసులు డిసెంబర్ 13 రాత్రి వేళ మాదాపూర్‌లోని మైండ్‌షేర్ యునైటెడ్ ఫౌండేషన్‌లోని కార్యాలయంపై దాడి చేశారు. దీంతో ఇది కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌గా తెలిసింది. ఈ విచారణలోనే సునీల్ కనుగోలు పేరు తెరపైకి వచ్చింది. 41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులను ఆయనకు జారీ చేశారు. విచారణకు రాకపోతే అరెస్టు కూడా చేస్తామని నోటీసుల్లో పోలీసులు హెచ్చరించారు.
అసలు కారణం ఏంటి..?
సునీల్ కనుగోలు ఆలిండియా కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహిరిస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయా రాష్ట్రాల సమస్యలు, కేంద్ర ప్రభుత్వ విధానాలను సందర్భాను సారం రాహుల్ కు తెలియజేస్తూ.. ప్రసంగాలను రూపొందిస్తున్నారు. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన బీజేపీ అధినాయకత్వం ఇక్కడి పాలకులకు సూచనలు చేసిందని, ఇందుకనుగుణంగానే తమ వార్ రూంపై పోలీసులు దాడులు చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇక త్వరలో జరగనున్న కర్నాటక, తెలంగాణ ఎన్నికల కోసం సేకరించిన సమాచారమంతా వార్ రూంలోనే ఉందని, వాటిని స్వాధీనం చేసుకునేందుకే పక్కా ప్రణాళికతో ఈ దాడి జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలోనే ఆరోపించారు.
హైకోర్టును ఆశ్రయించిన సునీల్
ఈ కేసులో సైబర్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై సునీల్ కనుగోలు డిసెంబర్ 29న హైకోర్టును ఆశ్రయించారు. అదే రోజున దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 3న తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 8న సునీల్ కనుగోలు పోలీసుల విచారణకు రావాలని, అయితే అతన్ని పోలీసులు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.