ఈటెల నుంచి కేసీఆర్‌కు వైద్య ఆరోగ్యశాఖ బదిలీ.. గవర్నర్ ఆమోదం.. భూకబ్జా ఆరోపణలపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక!

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి ఈటెల నుంచి వైద్య ఆరోగ్యశాఖ.. సీఎం కేసీఆర్ కు బదిలీ అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేశారు.
ఇప్పటికే ఈటెల రాజేందర్ భూకబ్జా ఆరోపణలపై విచారణ చేపట్టాలని సీఎం కేసీఆర్ సీఎస్ తో పాటు విజిలెన్స్ డీజీ, మెదక్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజేందర్ భూ కబ్జాలపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావు వెల్లడించారు.
అచ్చంపేట, మాసాయిపేట గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు.. తమ అసైన్డ్ భూములను మంత్రి ఈటెల గుంజుకున్నారని సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో సీఎం కేసీఆర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. అధికారులు.. ఈటల హేచరీస్ పక్కన ఉన్న అసైన్డ్ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహించారు. మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను వెరిఫై చేశారు. అచ్చంపేట, మాసాయిపేటలో మెదక్ కలెక్టర్ హరీష్ ఎంక్వయిరీ చేశారు. రైతులను అడిగి వివరాలు తీసుకున్నారు. ఈ విచారణ పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు.