Revanth Reddy Arrest: తెలంగాణలో కాంగ్రెస్ పోరుబాట – రేవంత్ రెడ్డి అరెస్టు..!!

చాలాకాలంగా ఇంటిపోరుతో తలల పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఊపు మొదలైంది. వరుస పోరాటాలతో పార్టీ నాయకత్వం కదన రంగంలో దూకుతున్నారు. మొన్న ఉపాధి నిధులు, నిన్న పోలీస్ ఉద్యోగార్థులు, ఇవాళ సర్పంచ్ ల పోరాటాలకు మద్దతునిస్తున్నారు. దీంతో గ్రామీణ స్థాయి పార్టీ కార్యకర్తలు సైతం రొడ్డెక్కుతున్నారు.
కేంద్రం గ్రామాలకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా వాడుకోవడాన్ని నిరసిస్తూ ‘రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్’ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన మహాధర్నాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. ఈ పోరాటంలో పాల్గొనేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నించగా.. పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. జూబ్లిహిల్స్ లోని తన నివాసం నుంచి ఇందిరాపార్క్ కు బయలుదేరిన ఆయనను పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. ధర్నాకు పోలీసుల అనుమతి లేదని, ఎవ్వరూ పాల్గొనొద్దంటూ సూచించారు. కానీ తాను ఎలాగైనా ధర్నాలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం తన బాధ్యత అన్నారు. దీంతో రేవంత్ రెడ్డికి, పోలీసు అధికారులకు మధ్య స్వప్ప వాగ్వాదం జరిగింది. ఇందిరాపార్క్ వద్ద ఎవ్వరైనా ధర్నా నిర్వహించే అవకాశాన్ని హైకోర్టు కల్పించిన విషయాన్ని రేవంత్ రెడ్డి పోలీసులకు గుర్తు చేశారు. ఇలాంటి పోరాటాలు చేయకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా..? అని ప్రశ్నించారు. తనను ఏ నిబంధనల మేరకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలసులను నిలదీశారు.
మరోవైపు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు భారీ సంఖ్యలో సర్పంచ్ లను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కాయి. అన్నిజిల్లా, మండల కేంద్రాలతో పాటు.. వందలాది గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పద్దతులు అవలంభిస్తోందని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పార్టీ నాయకుల అరెస్టులను ఖండిస్తూ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
మొత్తానికి వరుస నిరసనలు, ఆందోళనలతో ప్రజల్లోకి వస్తున్న కాంగ్రెస్ నాయకత్వం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వర్గ విభేదాలు, గ్రూపు తగాదాలతో పార్టీని నాశనం చేయొద్దని, ప్రజా సమస్యల పరిష్కారానికి పిలుపునిస్తే.. తామంతా ముందుకొస్తామని స్పష్టం చేస్తున్నారు.