Pavan Kalyan and Kcr Fight: పవన్ తో కేసీఆర్ కుస్తీ

నిన్నమొన్నటిదాకా పవన్ కల్యాణ్ కేసీఆర్ మధ్య మంచి దోస్తానా ఉంది. అంతేకాదు పవన్ కల్యాణ్ ఎప్పుడూ పెద్దగా కేసీఆర్ పాలన గురించి మాట్లాడింది లేదు. ఆమాట కొస్తే ఎప్పుడూ విమర్శలు చేయలేదు. కేసీఆర్ ఫ్రెండ్ షిప్ కోసమో లేక మరేదైనా కారణమో కానీ గత ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీచేయలేదు. అంతేకాదు కేసీఆర్ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. ఎన్ని షోలయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, స్నేహబంధాన్ని చాటుకున్నారు. కానీ ఇప్పుడు దోస్తానాకు చెక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేపథ్యంలో పవన్, కేసీఆర్ మధ్య కుస్తీ మొదలు కావొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఏపీలో జనసేన, టీడీపీ పోటీ చేస్తాయని భావిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా ముందుకెళ్తానంటున్న పవన్… ఇప్పుడు బీఆర్ఎస్ ద్వారా ఆ ఓటు చీలుతుందని భావిస్తున్నారట. అంతేకాదు ఇదంతా జగన్ కు మేలు చేసేందుకే కేసీఆర్ చేస్తున్నారా అని కూడా పవన్ కల్యాణ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.
ముఖ్యంగా తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ లోకి తీసుకోవడంపై పవన్ కల్యాణ్ ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. కాపు సామాజికవర్గానికి చెందిన చంద్రశేఖర్ ను తీసుకోవడం, బీఆర్ఎస్ ఏపీ పగ్గాలు అప్పజెప్పడాన్ని పవన్ సీరియస్ గా తీసుకుంటున్నారట. తనతో ఇంత మంచి రిలేషన్ ఉన్నప్పటికీ తోట చంద్రశేఖర్ ను తీసుకోవడం ఏంటని జనసేనాని నిప్పులు చెరుగుతున్నారని టాక్.
బీఆర్ఎస్ తో జనసేన, టీడీపీ నష్టమనే ప్రచారం
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఇస్తే జనసేన, టీడీపీ ఓట్లలో చీలిక ఏర్పడే అవకాశముందని ఈ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు బీఆర్ఎస్ తమను ఇబ్బందిపెట్టేందుకే ఎంట్రీ ఇచ్చిందని అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు కూడా భావిస్తున్నారట. అందుకే ఇక బీఆర్ఎస్ ను లైట్ తీసుకోవద్దన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టడానికి పక్కాగా స్కెచ్ వేసుకుంటున్నారట. రాష్ట్ర విభజనకు కేసీఆర్ మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ ఏపీ ప్రజలకు ఆ ప్రసంగాలను గుర్తు చేస్తే ఎలా ఉంటుదన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు టాక్.
బీఆర్ఎస్ టార్గెట్ గా సమాలోచనలు
అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ తరపున ప్రతినిధులు ఇప్పటికే సమావేశమైనట్లు వార్తలొస్తున్నాయి. బీఆర్ఎస్ కు ఎలాంటి కౌంటర్లు ఇవ్వాలన్న దానిపై సమాలోచనలు కూడా జరిపినట్లు టాక్. అందరూ బీఆర్ఎస్ ను వ్యతిరేకించినట్లు సమాచారం. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో పరోక్షంగా జగన్ కే లాభమన్న వాదన ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఏపీలో ఎంట్రీ ఇస్తానంటున్న కేసీఆర్ ఇప్పటిదాకా ఏపీలోని ఏ పార్టీపైనా విమర్శలు చేయలేదు. ముందు ముందు ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారన్నది చూడాలి. ప్రస్తుతానికైతే ఆయన బీజేపీపైనే ఫోకస్ చేస్తారన్న అంచనాలున్నాయి. ఇప్పుడప్పుడే పవన్ కల్యాణ్ జోలికి కానీ, టీడీపీ జోలికి గానీ కేసీఆర్ వెళ్లే అవకాశాలు లేవన్న ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ పవన్ మాత్రం కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని సమాచారం.
అవసరమైతే ఇప్పటి నుంచే కేసీఆర్ పై విమర్శలు చేయడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నటప్పటికీ పవన్ కల్యాణ్ కొంత టైమ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. తెలంగాణలో తన సినిమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతమాత్రాన కేసీఆర్ ను లైట్ తీసుకునే ఆలోచన అయితే పవన్ కు లేదనే తెలుస్తోంది. చూడాలి మరి పవన్ కల్యాణ్, కేసీఆర్ మధ్య ఎలాంటి సమరం జరుగుతుందో, నిజంగానే సమరం జరుగుతుందా లేదా సంధి ఉంటుందా అన్నది చూడాలి.