Kanna Fire on Somu: ఏపీ బీజేపీలో డిష్యుం డిష్యుం..!!

ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు ఎక్కుపెట్టారు. గుంటూరు బీజేపీ అధ్యక్షుడిని ఎందుకు మార్చారంటూ నిలదీశారు. కోర్ కమిటీలో చర్చించకుండా ఈ మార్పులేంటని ప్రశ్నించారు. ఇటీవల గుంటూరు బీజేపీ అధ్యక్షుడిని మార్చి వేరే వారికి అవకాశం ఇచ్చారు సోము వీర్రాజు. ఈ వ్యవహారంలో కన్నా పాత్ర లేదు. ఆయనకు తగిన సమాచారం కూడా లేదని కన్నా సన్నిహితుల వాదన. దీంతో కన్నా లక్ష్మీనారాయణ సోముపై గుర్రుగా ఉన్నారు. సోము పేరు చెబితేనే అంతెత్తున లేస్తున్నారు. సోము వీర్రాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సోము వియ్యంకుడి ప్రస్తావన తెచ్చిన కన్నా
సోము వీర్రాజు వియ్యంకుడు బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని ప్రస్తావించారు కన్నా. సొంత వియ్యంకుడు బీఆర్ఎస్ లో చేరడంపై సోము స్పందనేంటని ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీలో బీజేపీ నేతల కుటుంబసభ్యులు ఎలా ఉంటారన్నది కన్నా ప్రశ్న. తాను ఎంతో కష్టపడి ఇతర పార్టీల నాయకులను బీజేపీలోకి తీసుకొస్తే.. సోము బయటకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోము వర్సెస్ కన్నా
సోము వీర్రాజుకు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య చాలాకాలంగా గ్యాప్ ఉంది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ చీఫ్ గా ఉన్న సమయంలో సోము వీర్రాజుకు తగిన ప్రాధాన్య ఇవ్వలేదన్న వాదన ఉంది. అది మనసులో పెట్టుకునే ఇప్పుడు సోము వీర్రాజు.. కన్నా సహనాన్ని పరీక్షిస్తున్నారని కమలం పార్టీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు.
అధిష్టానం దగ్గర సోము వీర్రాజుకు, కన్నా లక్ష్మీనారాయణకు మంచి పలుకుబడి ఉంది. ఇద్దరూ ఇద్దరే. గట్టి లాబీయింగ్ చేయగలరు. అయినప్పటికీ ఒకే ఒరలో రెండు కత్తులు అన్నట్లుగా ఒకరంటే ఒకరికి పడకపోవడం పార్టీ శ్రేణులకు కూడా ఇబ్బందిగా మారింది. ఒకరి దగ్గరికి వెళ్తే మరొకరికి కోపం. దీంతో బీజేపీ క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. ఇద్దరు నేతల మధ్య అంతర్యుద్ధంలో తాము నలిగిపోతున్నామని ఆవేదన చెందుతున్నారట.
బాగా యాక్టివ్ అయిన కన్నా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. ఇదే సోము వీర్రాజుకు మింగుడుపడడం లేదన్న వాదన వినిపిస్తోంది. టికెట్ల కేటాయింపులో కన్నా ఎక్కడ కీరోల్ పోషిస్తారోనన్న అనుమానంతోనే కన్నాకు.. సోము బ్రేకులు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సోము ఎంత బ్రేకులేస్తున్నా కన్నా మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. దొరికిన అవకాశాన్ని వదలకుండా సోమును టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు బీజేపీ అధ్యక్షుడి మార్పును తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా సోము వీర్రాజును ఛాలెంజ్ చేసి, హైకమాండ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు సరంజామా సిద్ధం చేసుకుంటున్నారట.
ఓవైపు కన్నా, మరోవైపు సోము వీర్రాజు మధ్య డైలాగ్ వార్ తో బీజేపీ హైకమాండ్ కు తలనొప్పులు వస్తున్నాయట. ఎవరికి నచ్చజెప్పాలో, ఎవరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలో అని పార్టీ పెద్దలు మథనపడుతున్నారట. ఓవైపు చూస్తే కన్నా సీనియర్. మరోవైపు చూస్తే సోము వీర్రాజు బీజేపీ చీఫ్. దీంతో ఇద్దరినీ నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇలాంటి గొడవలు మాని, సర్దుకుపోవాలని జీవీఎల్ లాంటి నేతలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో. నిజంగానే కన్నా, సోము కాంప్రమైజ్ అవుతారా, లేక ఇదే వార్ ను కంటిన్యూ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.