తెలంగాణ బీజేపీకి షాక్…! సాగర్ ఉపఎన్నికల బరిలో జనసేన?
తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య రోజు రోజుకి వివాదం ముదురుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ తమను రాష్ట్ర బీజేపీ నాయకత్వం అవమానకరమైన రీతిలో వ్యవహరిస్తోందని విమర్శిస్తోంది. ఈ మాటలను అన్నది సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావడం గమనార్హం. ఎందుకంటే అంతేకాదు ఇటీవల జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి పవన్ కళ్యాణ్ మద్ధతు ప్రకటించి బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. అంతేకాదు రాష్ట్ర పార్టీ నేతలను ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఏకేశారు. దీంతో వీరి మధ్య సయోధ్య కుదరడం లేదనే విషయం బయటకు తెలుస్తోంది. అటు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం విషయంలోనూ పవన్ కళ్యాణ్ కు బీజేపీ తీరుపై అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో బీజేపీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది.
ఇప్పటికే తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలు వచ్చే నెలలో జరగబోతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సిద్దమవుతున్నాయి. అయితే దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అదే ఊపులో సాగర్ స్థానాన్ని కూడా సొంతం చేసుకోవాలని పావులు కదుపుతోంది. అయితే బీజేపీ ఆశలపై నీళ్లు చల్లేలా ఇక్కడ జనసేన కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని నేరుగా ప్రకటించలేదు. కానీ తెరవెనుక ఆ ప్రయత్నాలను మొదలు పెట్టింది. తాజాగా ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సాగర్ బరిలో జనసేన నిలబడేందుకు అనుమానానికి ఆజ్యం పోసింది. అయితే అదే జరిగితే కనుక ఓట్లు చీలి బీజేపీకి ఎక్కువ నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారంలో పాల్గొంటే యువత, అలాగే కొన్ని వర్గాలు ఆయన వెనుక నిలిచే అవకాశం ఉంది. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే నష్ట నివారణ చర్యలు చేపడితే మంచిదని, లేకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్ కు పవన్ కళ్యాణ్ మధ్య చక్కటి బంధం ఉందని, టీఆర్ఎస్ పార్టీనే జనసేనను బరిలోకి నిలిపేలా ప్రయత్నం చేస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అదే కనుక జరిగితే సాగర్ ఎన్నికలు మరింత మసాలా రంగరించుకునే అవకాశం ఉంది.