హరీష్ రావుకు మళ్లీ టీఆర్ఎస్ లో పూర్వవైభవం..మామ మాటను నిలబెట్టిన అల్లుడు…
టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ ఎవరైనా ఉన్నారంటే వెంటనే టక్కున గుర్తొచ్చే పేరు హరీష్ రావు. మామకు తగ్గ అల్లుడిగా పొలిటికల్ చదరంగంలో పావులు కదపడంలో ఆయన దిట్ట. కేసీఆర్ రాజకీయాల్లో హరీష్ రావు తెర వెనుకే కాదు. తెర ముందుకు వచ్చి కూడా యాక్టివ్ గా ఉంది తన సత్తా చాటాడు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా పునాదులు ఏర్పాటు చేయడంలో హరీష్ రావు పాత్ర మరువలేనిది. అటు ఉద్యమ సమయంలో కూడా హరీష్ రావు ముందు వరుసలో నిలిచి తన సత్తా చాటాడు. అయితే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంతో ఆ పార్టీ అధికారంలోకి రావడంతోనే పలు కీలక శాఖల బాధ్యతలు చేపట్టాడు. అంతేకాదు మిషన్ కాకతీయ పేరుతో ప్రజల్లోకి వెళ్లాడు. అలాగే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతలను హరీష్ రావు తలకెత్తుకున్నాడు. అటు పార్టీని సైతం ముందుండి నడిపించడంలో హరీష్ రావు పాత్ర మరువలేనిది. ఉపఎన్నికలు వచ్చాయంటే చాలు హరీష్ రావు వేసే ఎత్తులకు ప్రత్యర్థులు చిత్తు అవ్వాల్సిందే. గతంలో ఉద్యమ సమయంలో జరిగిన ఉపఎన్నికలు అన్నింట్లోనూ హరీష్ రావు కీలకంగా తన రాజకీయ వ్యూహాలతో తిరుగులేనిశక్తిగా టీఆర్ఎస్ ను నిలిపాడు. ఆ తర్వాత కూడా జరిగిన నారాయణ్ ఖేడ్ ఉపఎన్నిక, వరంగల్ పార్లమెంటు ఎన్నిక ఇలా అన్నింట్లోనూ విజయం సాధించాడు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డిని కొడంగల్ లో ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేశాడు. ఇవన్నీ హరీష్ రావు సత్తాకు మచ్చుతునక మాత్రమే. అయితే టీఆర్ఎస్ పార్టీలో పవర్ సెంటర్ గా మారుతున్నారనే వదంతలు ఎప్పటి నుంచో ఆ పార్టీలో గుసగుస పెడుతున్నాయి. అటు మామ కేసీఆర్, హరీష్ పై కాస్త గుర్రుగా ఉన్నారని అందుకే రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత కేబినేట్ కు దూరంగా ఉంచారని, ఆ తర్వాత కూడా అంతగా ప్రాధాన్యత లేని ఆర్థిక శాఖకు బదలాయించారని చెప్పుకొచ్చారు.
అయితే దుబ్బాక ఎన్నికల్లో అంతా తానై తిరిగిన హరీష్ రావుకు చేదు అనుభవం మిగిల్చింది. అంతేకాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం హరీష్ బాధ్యతలు చేపట్టినప్పటికీ బీజేపీ అత్యధిక డివిజన్లలో గెలిచి టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఫలితంగా హరీష్ రావును కేవలం సిద్ధిపేటకు పరిమితం చేశారనే వదంతులు వ్యాపించాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే హరీష్ రావుకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికలు వరంగా మారాయి. నిజానికి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం కలే…అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఎందుకంటే విద్యాధికుల్లో చాలా మంది టీఆర్ఎస్ కు వ్యతిరేకమని, బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పుంజుకుందని, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో టీఆర్ఎస్ గెలవడం కష్టమని అంచనా వేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హరీష్ బాధ్యతలు చేపట్టారు. చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించినా, సమయం లేకపోయినప్పటికీ, హరీష్ రావు తన చాకచక్యంతో చక చకా వ్యూహాలు పన్నడంతో, సైలెంటుగా తన వ్యూహాలను అమలు చేశారు. చాపకింద నీరులా ఓటర్లను తమ వైపు తిప్పుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించి, ఓటర్లను తమ వైపునకు సైలెంటుగా తిప్పేసుకున్నారు. ఫలితమే కీలకమైన సమయంలో కీలకమైన సీటులో పీవీ వాణి విజయం దక్కింది. అయితే అల్లుడు సాధించిన విజయంతో కేసీఆర్ ఫుల్ హ్యాపీ అయినట్లు తెలుస్తోంది. రానున్న నాగార్జున సాగర్ ఎన్నికల్లోనూ హరీష్ రావు కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మామ అల్లుడు ఏకమైతే తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం, ప్రతిపక్షాలకు కష్టమే.