5 రాష్ట్రాల ఎన్నికలు పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నాం.. విమర్శలకు భయపడి కొనసాగించాం.. మద్రాసు హైకోర్టుకు ఈసీ వివరణ

కరోనా తీవ్రత వేళ ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించి.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో పాటు ఆయా రాష్ట్రాల హైకోర్టుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పందించింది. నిజానికి కొన్ని దశల ఎన్నికలను వాయిదా వేద్దామని భావించినట్లు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. కానీ.. ప్రెసిడెంట్ రూల్ పెడితే ఈసీపై విమర్శలు వస్తాయని భావించినట్లు చెప్పారు. మద్రాస్ హైకోర్టుకు సమర్పించే అఫిడవిట్‌లో వివరణ ఇచ్చారు. అంతేకాదు కొన్ని పార్టీలకు అనుకూలంగా ఈసీ వ్యవహరించిందనే ఆరోపణలు వచ్చే అవకాశం ఉండేదన్నారు. అందుకే ఎన్నికలు కొనసాగించినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు.
బెంగాల్‌లో సైతం అన్ని దశల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి అనుకున్నట్లు చెప్పారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 30 ప్రకారం ఒక్కో ఎన్నికల దశ ప్రత్యేకమైనది వెల్లడించారు. ఒక్కోదానికి ఒక్కో నోటిఫికేషన్ వేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏడు, ఎనిమిది దశలను చట్టపరంగా కలిపే వీలు ఉన్నదని చెప్పారు. వీటికి నోటిఫికేషన్ ఒకటే కాబట్టి.. ఏప్రిల్ 26, 29 మధ్య ప్రచారం జరగకుండా చూసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో ప్రచారం ముగించాల్సిన సమయాన్ని 48 గంటల నుంచి 72 గంటలకు పెంచినట్లు చెప్పారు.
ఎన్నికల నిర్వహణకు కారణమైన తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వ్యక్తి గతం తనను శిక్షించినా బాధపడనని రాజీవ్ కుమార్ చెప్పారు. ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్రం ఆవేదన, నిరుత్సాహం కలిగించినట్లు చెప్పారు. అటు ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీకి శిక్ష వేయకుండా, వ్యక్తులకు వేయాలని ఆయన కోర్టును కోరారు.