Dharmana: ధర్మాన రూటే సపరేటు!

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లపాటు ధర్మాన ప్రసాదరావు లోప్రొఫైల్ లో ఉన్నారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా కొనసాగినా ఆయన మాత్రం బయట ఎక్కడా హడావుడి చేయలేదు. సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. అసలు ధర్మాన ఎమ్మెల్యేగా ఉన్న విషయం కూడా బయట చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. కానీ జగన్ ఆయనను ఎప్పుడైతే మంత్రిని చేశారో.. ధర్మాన ఫామ్ లోకి వచ్చేశారు. అదేపనిగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాకు ఎప్పటికప్పుడు హాట్ హాట్ న్యూస్ ఇస్తున్నారు.
ధర్మాన రిటైర్మెంట్ ఖాయమేనా?
ధర్మాన ప్రసాదరావుకు రాజకీయాల నుంచి రిటైర్ తీసుకోవాలని ఉందట. ఇదే విషయం జగన్ తోనూ చెప్పేశారట. అయితే అందుకు ఏపీ సీఎం జగన్ ఒప్పుకోలేదట. అందుకే ఈసారికి ఎన్నికల్లో పోటీచేసి ఆ తర్వాత రిటైర్ అవుతానని హాట్ న్యూస్ ప్రకటించేశారు. అంతేకాదు పనిలో పనిగా చంద్రబాబుపైనా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారాయన. అమరావతిని రాజధానిగా ఉంచితే విశాఖ కేంద్రం చిన్నరాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు.
ఉత్తరాంధ్ర గళం ఎందుకు?
ధర్మాన ప్రసాదరావు నోటివెంట తరచుగా ఉత్తరాంధ్ర గళం వినిపిస్తోంది. ఆమధ్య ఒకసారి ఉత్తరాంధ్ర అంటూ మాట్లాడారు. తాజాగా మరోసారి అదే వాయిస్ ను వినిపించారు ధర్మాన. మరి ఆయన ఉత్తరాంధ్ర గళం వెనుక వ్యూహం ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. జగన్ కు తెలిసే ధర్మాన ఇలా మాట్లాడుతున్నారా.. లేక ధర్మాన సొంతంగా ఈ వాయిస్ ను వినిపిస్తున్నారా అన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.
ఉత్తరాంధ్ర నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ రూపంలో సీనియర్ నాయకుడు ఉన్నారు. అయినా ఆయన ఎప్పుడూ ఉత్తరాంధ్ర వాయిస్ ను వినిపించలేదు. మరి ధర్మాన మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారన్న దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
ధర్మాన వ్యాఖ్యలపై రకరకాల వాదనలున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి బొత్స ఒక్కరే హైలైట్ అవుతున్నారు. ఆ మధ్య ధర్మాన తమ్ముడు కృష్ణదాస్ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ జగన్ కు దగ్గరవ్వడంలో బొత్స బాగా సక్సెస్ అయ్యారు. కాబట్టే ఉత్తరాంధ్ర నుంచి తాను కూడా సీనియర్ నే అని చాటుకోవడానికే ధర్మాన ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు తరచూ చేయడం ద్వారా మంచి మైలేజ్ వస్తోందని ధర్మాన సన్నిహితులు చెబుతున్నారట. అందుకే ధర్మాన ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
పబ్లిక్ లో హైలెట్ అవ్వడానికే ధర్మాన ఇలా మాట్లాడుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. లేకపోతే జగన్ సర్కారులో ఉత్తరాంధ్ర వాయిస్ ను వినిపించడమంటే మామూలు విషయం కాదు. తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఇదంతా చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు జగన్ కు కూడా అప్పుడప్పుడూ ఈ ఉత్తరాంధ్ర వ్యాఖ్యల గురించి ఫీడ్ బ్యాక్ కూడా వస్తోందట.
కొంతమంది నాయకులు ధర్మాన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తే జగన్ లైట్ తీసుకుంటున్నారట. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఉంటే చాలు.. ఇలాంటి మాటలు మీడియాలో మాత్రం హైలైట్ అవుతాయని చెప్పారట. అదంతా తెలుసు కాబట్టే, ధర్మాన ఇలా పదే పదే ఉత్తరాంధ్ర అంటూ మాట్లాడుతూ హైలైట్ అవుతున్నారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది వైసీపీ నాయకులకే తెలియాలి. ఎందుకంటే ఎవరూ కూడా ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ కానీ, వ్యతిరేకిస్తూ కానీ మాట్లాడడం లేదు. అందుకే రాజకీయ విశ్లేషకులు కూడా ధర్మాన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.