TDP: తొక్కిసలాటలు టీడీపీ కొంప ముంచుతాయా?

వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇటీవల చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. కందుకూరులో జరిగిన విషాదఘటనను మరువకముందే గుంటూరులో ఏర్పాటుచేసిన సభలోనూ అదే జరిగింది. తొక్కిసలాట జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనలు ప్రమాదవశాత్తూ జరిగినా రాజకీయ వర్గాల్లో మాత్రం వీటిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది.
జనం ఎక్కువ మంది వచ్చారని చెప్పుకోవడానికేనా?
చంద్రబాబు కావాలనే చిన్న స్థలాల్లో మీటింగ్ ను పెడుతున్నారని … తద్వారా తక్కువ మంది జనం వచ్చినా ఎక్కువ మంది కనిపించేలా ప్లాన్ చేసుకుంటారని వైసీపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. చిన్న స్థలాల్లో మీటింగ్ పెట్టి జనాల ప్రాణాలు తీస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు మీటింగులకు జనం ఎక్కువమంది వస్తున్నారన్న కలరింగ్ ఇవ్వడానికే ఇదంతా జరుగుతోందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయడానికే ఇలా ఇరుకుస్థలాల్లో జనాలు కనిపించేలా ప్లాన్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. రాజకీయ వర్గాల్లోనూ చాలామంది ఇది కూడా ఒక కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు.
నిజంగానే జనం వస్తున్నారా?
మరోవైపు టీడీపీ నేతల వెర్షన్ మరోలా ఉంది. మీటింగుల కోసం జనాల ప్రాణాలు తీసేంత దుర్మార్గాలు చేసే పార్టీ కాదంటూ వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు. జనాలు నిజంగానే వస్తున్నారని… అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రమాదశాత్తూ జరిగిన ఘటనలపై ఇలాంటి విమర్శలు సరికావని అభిప్రాయపడుతున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ రెండు ఘటనల్లో జనం ప్రాణాలు పోయిన మాట వాస్తవమే అయినప్పటికీ నిజంగానే చంద్రబాబుకు ఫాలోయింగ్ పెరిగింది అని టీడీపీ క్యాడర్ చెబుతున్నారు.
జనం వచ్చినంత మాత్రాన అధికారంలోకి వస్తారా?
ఎవరి వాదన ఎలా ఉన్నా నాయకుడు ఎవరైనా మీటింగులు పెడితే మాత్రం జనాలు కచ్చితంగా వస్తారు. గతంలో చిరంజీవికి వచ్చారు. పవన్ కల్యాణ్ కు వచ్చారు. జగన్ కు వచ్చారు. అంతమాత్రాన అది ప్రజాబలం అనుకుంటే పప్పులే కాలేసినట్లే. జనం వచ్చినా చిరంజీవి మాత్రం అధికారంలోకి రాలేదు. పవన్ కల్యాణ్ కు డిపాజిట్లు కూడా రాలేదు. కాబట్టి ఇది అందరూ గ్రహించాల్సిన వాస్తవం. ఎక్కువమంది జనం వచ్చి, తొక్కిసలాట జరిగితే అది ప్రజాబలంగా అనుకుంటే కచ్చితంగా ముప్పే. ఈ రెండు సంఘటనలు చూసి జనాల్లో బలం పెరిగిందని టీడీపీ అనుకుంటే మాత్రం వాపును చూసి బలుపు అనుకున్నట్లే. కాబట్టి మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం టీడీపీదే. లేకపోతే ఇలాంటి ప్రమాదాల వల్ల జనంలో నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకుండా జాగ్రత్తగా ఉండాలన్నది విశ్లేషకుల మాట. ఇక ముందు చంద్రబాబు మీటింగులు జరిగేటప్పుడు టీడీపీ నాయకులు అన్నీ ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ అయితే మాత్రం కచ్చితంగా టీడీపీకి బూమరాంగ్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.