Bjp focussed on ap : ఏపీలో పాగాకు బీజేపీ బిగ్ స్కెచ్

బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ ఫోకస్ పెట్టింది. చాలా కాలం నుంచి రాష్ట్ర రాజకీయాలను గమనిస్తూ ఉన్న ఢిల్లీ కమలనాథులు.. ఏపీలో పాగా వేసేందుకు సరైన సమయం ఆసన్నమైందన్న ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే ఇకపై ఆంధ్రప్రదేశ్ వేదికగా కాషాయ రాజకీయం మొదలుకానుంది.
పాదయాత్రలతో జనంలోకి..
ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టేందుకు ఏపీ కాషాయ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సన్నాహకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో.. ఈ నెల 8న రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈ రెండు సభలను కూడా రాయలసీమ జిల్లాల్లోనే ఏర్పాటు చేయడంతో ప్రాధాన్యత ఏర్పడింది. కర్నూలు, హిందూపురంలో నిర్వహించనున్న ఈ సభలకు భారీ జన సమీకరణ చేసేందుకు ఏపీ బీజేపీ నాయకత్వం వ్యూహాలు ఇప్పటికే మొదలుపెట్టింది. కర్నూలు, హిందూపురం పార్లమెంటరీ జిల్లాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సుడిగాలి పర్యటనలను జరిపేలా ఏర్పాట్లు చేస్తోంది. అమిత్ షా బహిరంగ సభలతో రాయలసీమలో తమ ప్రాభావం మొదలవనుందని ఏపీ బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ భారీ సభల ప్రభావం రాయలసీమ వ్యాప్తంగా ఉంటుందని వారు నమ్ముతున్నారు.
కేంద్ర పథకాలపై ప్రచారం
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో పర్యటనలకు ఏపీ బీజేపీ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో 13 వేల గ్రామాల్లో పాదయాత్రలను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేసేలా ఈ పాదయాత్రలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో తమ వాటాను కూడా వివరించాలని ఏపీ బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు.
పొసగని పొత్తులు
భారతీయ జనతా పార్టీతో అధికార వైసీపీ మైత్రి తెర వెనుక సాగుతుందన్నది బహిరంగ రహస్యం. కానీ ఇప్పటి వరకు ఇరుపార్టీ నేతలు, నాయకులెవ్వరూ ఈ విషయాన్ని నేరుగా ప్రస్థావించడంలేదు. ఇక జనసేన పార్టీ – బీజేపీ మధ్య చెలిమి కొనసాగుతోన్న విషయం బహిరంగమే. తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే చంద్రబాబును ఢిల్లీ పెద్దలు దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో బీజేపీ ఎదుగుదల ఆధారంగా పొత్తులకు తుది రూపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమిత్ షా టూర్ షెడ్యూల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 8న ఆంధ్ర ప్రదేశ్ పర్యటన బిజీ బిజీగా కొనసాగనుంది. తొలుత కర్నూలుకు చేరుకోనున్న అమిత్ షా అనంతరం పుట్టపర్తిలోనూ పర్యటించనున్నారు. ఉదయం 11.15కు కర్నూల్లో అమిత్ షా బహిరంగసభ జరగనుంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకి బీజేపీ కార్యకర్తలతో భేటీ కానున్నారు అమిత్ షా. అనంతరం సత్యసాయి జిల్లాకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3గంటలకి పుట్టపర్తిలో అమిత్ షా బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకి పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమాన్ని అమిత్ షా సందర్శిస్తారు. ఈ తర్వాత పుట్టపర్తిలో సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు అమిత్ షా. దీంతో అమిత్ షా టూర్ ముగియనుంది.