స్పీకర్ అనుమతి లేకుండా అరెస్టు చేస్తారా.? ఎంపీ రఘురామ అరెస్టుపై బండి సంజయ్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామ కృష్టంరాజును అరెస్టుపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన తీరు చాలా దారుణంగా ఉందన్నారు. ఒక ఎంపీ అని చూడకుండా ఈడ్చుకుపోతారా? అని మండిపడ్డారు. బలవంతంగా కారులోకి విసిరేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ స్పీకర్ అనుమతి లేకుండా పార్లమెంటు సభ్యుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అనుమతించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన కొనసాగుతోందా అని ప్రశ్నించారు. మిత్రుడైన ఏపీ సీఎం కోసం నియంతృత్వ పాలన సాగిస్తున్నారా? అంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మఫ్టీలో వచ్చిన వారిని చూస్తే పోలీసులో, కిడ్నాపర్లో అర్థం కాలేదన్నారు. రఘరామను అరెస్టు చేశారో, అపహరించారో ఆయన కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాలేదన్నారు.
రఘురామ కృష్టంరాజుకు 4 నెలల కిందట గుండెకు శస్త్రచికిత్స అయిందన్నారు. ఒక హార్ట్ పేషెంట్ తో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రాణాలను అరచేత పట్టుకుని హైదరాబాద్‌కు వస్తున్న ప్రజలను సరిహద్దుల్లో ఆపేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఎంపీని అరెస్టు చేయించేందుకు పోలీసులను ఎలా రానిచ్చిందో చెప్పాలన్నార. లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి.. పదుల సంఖ్యలో ఏపీ సీఐడీ పోలీసుల్ని ఇంత అత్యవసరంగా రాష్ట్రంలోకి ఎందుకు అనుమతించారన్నారు. రఘురామ కృష్ణంరాజు దేశం వదిలి పారిపోతున్నారా? అని నిలతీశారు. ఎంపీకి ఎన్నో హక్కులు ఉంటాయన్న ఆయన.. ఏపీ, తెలంగాణ పోలీసులకు తెలియదా? అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజద్రోహంతో పాటు పలు కేసుల్లో అరెస్టు అయిన నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుపై సీఐడీ విచారణ కొనసాగుతుంది. నిన్న ఆయనను హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు.. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ప్రశ్నించారు. అర్ధరాత్రి వరకూ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ విచారించారు. ఇవాళ కూడా అధికారులు మరోసారి విచారించనున్నారు.