బీజేపీతో బలవంతపు విడాకులు…చేతులెత్తేసిన వీర్రాజు…ఎటూ తేల్చుకోలేకపోతున్న పవన్
ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికలు పూర్తికాగా, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు సమయానికి రాజకీయం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఏపీ రాజకీయమంతా వైజాగ్ స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతోంది. మొన్న ఆలయాల ధ్వంసం, దేవాలయాల భూముల ఆక్రమణలు, లాంటి అంశాలతో కాస్త మైలేజీలోకి వచ్చిన బీజేపీ, జనసేన కూటమి పంచాయితీ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టింది. అయితే సరిగ్గా మున్సిపల్ ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దెబ్బతో రాష్ట్రంలో బీజేపీ నేతల భవిష్యత్తు ఇరుకునపడింది. ఓ వైపు వైసీపీ, అటు టీడీపీ, వామ పక్షాలు ఇప్పటికే బీజేపీని దోషిగా చూపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే తెలుగింటి కోడలు అయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టీల్ ప్లాంటు విషయంలో మొండిగా ముందుకు వెళ్తుండటంతో స్థానిక బీజేపీ నేతలు తలపట్టుకుంటున్నారు. ప్రైవేటీకరణ కనుక జరిగితే ఏపీలో బీజేపీ పార్టీ మరో రెండు, మూడు దశాబ్దాల పాటు కనబడకుండా పోతుందని, తమ రాజకీయ జీవితాలకు మరణ శాసనమే అని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, వైజాగ్ మాజీ ఎంపీ పురంధేశ్వరి లేఖ రాశారు. అయినప్పటికీ నిర్మల కనికరించలేదు. పైపెచ్చు ప్రైవేటికరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంటును ఎవరూ కొనడానికి ముందుకు రాకపోతే, తాము దాన్ని శాశ్వత లాకౌట్ వేస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తేల్చడంతో అటూ, బీజేపీ పార్టీ ఏపీ ప్రజలతో కయ్యానికి కాలుదువ్వడానికి సిద్ధమేనని చెప్పకనే చెప్పింది. 2019 ఎన్నికల్లో ఏపీకి ద్రోహం చేసిందనే కారణంతో బీజేపీకి రాష్ట్రంలో ఎక్కడా డిపాజిట్లు లేకుండా చేసిన ఓటర్లు.. ఇప్పుడు స్ధానిక పోరులోనూ అదే బాట పడతారనే సీన్ కనిపిస్తోంది. అంతేకాదు బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న తిరుపతి ఉపఎన్నిక హడావిడి మొదలు కాక ముందే చేతులు ఎత్తేసింది.
అంతేకాదు ఆ సీటును మిత్రపక్షం జనసేనకు వదులుకోనున్నట్లు తెలిపింది. అయితే జనసేనకు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన పార్టీకి పునాదులన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే ఉత్తరాంధ్రలోనే అధికంగా ఉన్నాయి. ఆ పార్టీ బేస్ మొత్తం తీరాంధ్ర ప్రాంతంలోనే ఉంది. విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగే నేపథ్యంలో బీజేపీతో కలిసి ఉంటే ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని పవన్ కు అత్యంత సన్నిహితులు చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు లేవు కనుక, బీజేపీకి రాంరాం చెప్పి, ఉక్కు ఉద్యమం జెండాను భుజానికి ఎత్తుకుంటేనే మనుగడ ఉందని పవన్ సన్నిహితులు హితవు పలికారట. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
ఇప్పటికే రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీని పునాదులతో సహా పెకలించి పారేసిన ఏపీ ప్రజలు, ఇఫ్పుడు ప్రత్యేక హోదా, పోలవరం ఇష్యూల్లో కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని బీజేపీ పార్టీపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కూడా తోడైతే, ఇక భవిష్యత్తులో ఏపీలో బీజేపీ ఎదగడం దుర్లభం అవుతుందని ఢిల్లీ పెద్దలకు ఏపీ బీజేపీ నేతలు మొరపెట్టుకున్నట్లు సమాచారం. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.