భారత్ పై ముంచుకొస్తున్న డ్రోన్ వార్…యుద్ధానికి సిద్ధమేనా..!

భారత్ పై ముంచుకొస్తున్న డ్రోన్ వార్…యుద్ధానికి సిద్ధమేనా..!

భారత్ సరికొత్త యుద్ధ వ్యూహాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? క్షిపణి దాడులు, అణు బాంబులను ఎదుర్కొనే సత్తా భారత సైన్యానికి ఉందనడంలో సందేహం లేదు. మరి డ్రోన్ల ద్వారా దాడి చేస్తే ఏంటి దారి? ఇవాళ డ్రోన్లు వచ్చాయి, రేపు రోబోలు రావొచ్చు. మరి వీటికి ఇండియా సిద్ధంగా ఉందా? ఇంతకీ డ్రోన్ల దాడిపై భారత ఆర్మీ అధికారులు ఏమంటున్నారు. డ్రోన్లను తిప్పికొట్టే వ్యవస్థను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది అని కామెంట్ చేశారంటే.. ఇప్పుడప్పుడే వాటిని నియంత్రించడం కష్టమనే అర్థమా?

జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై స్వల్ప వ్యవధిలోనే రెండు పేలుళ్లు జరిగాయి. ఒక డ్రోన్ వచ్చి బాంబు వేయగానే మరోదాన్నే అడ్డుకొని ఉండాల్సింది. కాని, అలా చేయడం సాధ్యం కాలేదు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఆయుధాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో. పైగా ఈ దాడి జరిగిన రెండు రోజులకే అర్ధరాత్రి సమయంలో మరో రెండు డ్రోన్లు వచ్చాయి. గంట రెండు గంటల గ్యాప్‌తో డ్రోన్లు కనిపించాయి. వీటిపై భారత జవాన్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ అవి తప్పించుకోగలిగాయి. రాత్రి సమయం కావడంతో అవి ఎటు వెళ్లాయో కూడా తెలియలేదు. వెంటనే కార్డన్ సెర్చ్ ప్రయోగించి, భారీగా బలగాలను రప్పించి.. అణువణువూ వెతికి చూశారు. కాని, ఎక్కడా డ్రోన్ల జాడ కనిపించలేదు. దీన్ని భద్రతా వైఫల్యంగా చూడలేం. ఎందుకంటే, ఇది మనకు సరికొత్త సాంకేతిక సవాల్. ఇంతకు ముందెన్నడూ జరగనివి, మనకు అనుభవం లేనివి.

శత్రుదేశం క్షిపణి వదిలితే.. మనం మేల్కొని దానికి ప్రతివ్యూహంగా మరో రాకెట్ వేయక్కర్లేదు. మన దగ్గర ఎస్-400 ఉంది. ఆటోమేటిక్‌గా అదే రాకెట్లను విసిరి శత్రు క్షిపణులను కూల్చేయగలదు. మన రాడార్ వ్యవస్థ కూడా సూపర్బ్. అందులో ఎలాంటి సందేహం లేదు. 24 గంటల పాటు సరిహద్దులను కనిపెట్టుకుని ఉంటాయి. జెట్ ఫైటర్లు వస్తున్నా, వాటి నుంచి బాంబులు వస్తున్నా వెంటనే అలర్ట్ చేస్తాయి. కాని, రాడార్లు పసిగట్టలేనంత తక్కువ ఎత్తుతో వస్తే ఏంటనేదే ప్రశ్న. ఇప్పుడు ఆ జాబితాలో డ్రోన్లను కూడా చేర్చవచ్చు. పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్లే ఇందుకు సాక్ష్యం. బార్డర్‌లో అత్యంత సమర్ధమైన జవాన్లు ఉన్నారు కాబట్టి.. వాటిని అక్కడికక్కడే కూల్చివేశాం. ఇండియన్ బార్డర్‌ను దాటుకుని రావడం ఆలస్యం.. జవాన్ల కంట్లో పడడం, నేలరాలడం జరిగాయి. కాని, ఇక్కడితోనే ఆగిపోతేనే ప్రమాదం. హమ్మయ్య సరిహద్దుల్లోనే పేల్చేశాం అని సంతోషిస్తే.. ఇదిగో ఇలా జమ్మూలో జరిగిన దాడులు జరుగుతూనే ఉంటాయి.

రేప్పొద్దున నిశ్శబ్దంగా ప్రయాణించగలిగే డ్రోన్లు రావొచ్చు. నిశిరాత్రిలో కలిసిపోయేలా రంగు మార్చుకుని రావొచ్చు. ఇప్పుడంటే.. కేవలం బాంబులను జారవిడుస్తున్నాయి. రేప్పొద్దున గన్స్ మాదిరిగా షూట్ చేయగలిగితే? రోబోటిక్ హ్యాండ్స్‌ ను జత చేసుకుని విరుచుకుపడితే ఏంటి పరిస్థితి? అందుకే, భవిష్యత్తులో డ్రోన్ల విషయంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మున్ముందు సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరుగుతాయో అంచనా వేసి.. దాని అనుగుణంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

ఒక ఏడాది ఏడాదిన్నరగా పాక్ సరిహద్దు నుంచి డ్రోన్లు వస్తున్నాయి. రేప్పొద్దున వీటితో ప్రమాదం తప్పదని భారత్ ఎప్పుడో గ్రహించింది. డ్రోన్ల దాడిని ఎదుర్కోవడంపై విధివిధానాలు తయారుచేస్తామని గత ఏడాది మార్చిలోనే ప్రకటించింది. ఇదే విషయంపై గత ఏడాది సెప్టెంబరులోనూ పార్లమెంట్ సమావేశాల్లో చర్చ కూడా జరిగింది. కాని, అవన్నీ చర్చలకే పరిమితం అయ్యాయని మొన్నటి జమ్మూ దాడితో తేలిపోయింది. దేశ సంరక్షణ విషయంలో నిమిషమైనా ఏమరపాటు తగదు. ఒక్క క్షణం ఆలస్యం అయినా భారీ నష్టం కలగొచ్చు.

ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. జమ్మూలో దాడి చేసిన డ్రోన్ చైనాది అని తేలింది. అసలు ఈ చైనా డ్రోన్లు ఎలా వస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయన్న నిఘా లేదు. నిజానికి వీటిని కనిపెట్టడం కూడా కష్టమే. చైనాలో తయారైన డ్రోన్లను మరో దేశం నుంచి కూడా తెప్పించుకోవచ్చు. పైగా డెలివరీ అడ్రస్ జమ్మూలోనే ఇవ్వక్కర్లేదు. చిన్న సిటీలకు కూడా విదేశాల నుంచి డెలివరీ అవుతున్నాయి. అక్కడి నుంచి బస్సులో పట్టుకొచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. అందుకే, డ్రోన్లను నియంత్రించడం అంత ఈజీ కాదని ఉన్నతాధికారులు సైతం చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఆకాశాన్ని జల్లెడ పట్టడం, భూమి నుంచి రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ఎగిరే వాటిపై నిఘా వేసే రాడార్ వ్యవస్థ వస్తేనే ఫలితం ఉంటుంది.

Leave a Reply

Morning Digestion Tips: మంచి జీర్ణక్రియ కోసం ఈ చిట్కాలను పాటించండి Bigg Boss Subhashree Rayaguru: మీకు తన గురించి ఈ విషయాలు తెలుసా? How To Boost Platelet Count: 10 సహజ మార్గాలు Food Tips: ఈ 10 ఆహార పదార్ధలు మీ ఫ్రిజ్ లో నిల్వచేయకండి India vs Pakistan Asia Cup: భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ చరిత్ర
%d