COVID-19 VACCINE: స్పుత్నిక్ వి డోసు ధర రూ.995.. రేటు ఫిక్స్ చేసిన రెడ్డీస్ ల్యాబ్.. త్వరలో తగ్గనున్నట్లు వెల్లడి

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లతో పాటు విదేశీ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటుంది. అమెరికాతో పాటు రష్యా కంపెనీలతో వ్యాక్సిన్ దిగుమతి కోసం ఒప్పందాలు చేసుకుంటుంది. ఇప్పటికే రష్యాకు చెందిన స్పుత్నిక్ వి డోసులు భారత్ కు చేరుకున్నాయి. అంతేకాకుండా రెడ్డీస్ ల్యాబ్ లో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసు ధరను రూ.995.40గా నిర్ణయించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వెల్లడించింది. అయితే రష్యా నుంచి దిగుమతి చేసుకున్న టీకాలకు మాత్రమే ఈ ధర ఉంటుందని తెలిపింది. భారత్ లో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లకు ఇంకా తక్కువ ధర ఉంటుందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న వ్యాక్సిన్ ఎమ్మార్పీని రూ.948గా నిర్ణయించగా.. దానికి 5 శాతం జీఎస్టీ కలిపితే ధర రూ.995.40 అవుతుంది.
మరోవైపు ఈ టీకా తొలి డోసును ఇప్పటికే హైదరాబాద్ వ్యక్తికి వేసినట్లు రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. ఈ నెల 1వ తేదీనే లక్షన్నర స్పుత్నిక్ వి టీకాలు హైదరాబాద్‌లో దిగాయి. వచ్చే కొద్ది నెలల్లో మరిన్ని డోసులు దిగుమతి కానున్నాయి. అనంతరం ఇండియాలోనూ ఈ వ్యాక్సిన్ తయారీ ప్రారంభిస్తామని రెడ్డీస్ ల్యాబ్ చెప్పింది. అటు వచ్చే వారమే స్పుత్నిక్ వి మార్కెట్‌లోకి రానుంది. మరో వైపు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సామర్థ్యం బాగుందని అమెరికా చీఫ్ హెల్త్ అడ్వయిజర్ ఫౌచీ తెలిపారు.