HEARTBREAKING COVID-19 NEWS: కరోనా వచ్చిన భర్త కోసం ప్రాణం పణంగా పెట్టిన భార్య.. పాజిటివ్ వచ్చిందని భార్యను చంపిన భర్త!

కరోనా మహమ్మారి ఓవైపు మనుషుల్లోని మానవత్వాన్ని బయటకు తెస్తుంటే.. మరోవైపు జనాల్లోని క్రూరత్వాన్ని బట్టబయలు చేస్తుంది. కరోనా వచ్చిన భర్తను బతికించుకునేందుకు ఓ భార్య తన నోటితో శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించగా.. తల్లి బాధను చూడలేక సూసైడ్ చేసుకున్నాడో కుమారుడు. పాజిటివ్ వచ్చిందని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త.
భర్త కోసం ప్రాణాలు పణంగా పెట్టిన భార్యః
కరోనా వచ్చిన తన భర్తను కాపాడుకునేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టింది ఓ మహిళ. శ్వాస తీసుకోలేక తన కళ్ల ముందే కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న భర్తకు తన నోటితో శ్వాస అందించేందుకు విఫలయత్నం చేసింది. అయినా తన భర్తను కాపాడుకోలేకపోయింది. తన ఒడిలోనే ప్రాణాలు విడిచిన భర్తను చూసి కుప్పకూలిపోయింది. మనస్సును కలచివేసిన ఈఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
ఆగ్రాకు చెందిన 47 ఏండ్ల రవి సింఘాల్ కు కరోనా సోకింది. కొద్ది రోజులుగా హోం ఐసోలేషన్ లోనే ఉన్నాడు. అనుకోకుండా తనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఏం చేయాలో తెలియక తన భార్య రేణు సింఘాల్ ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. హాస్పిటల్ దగ్గరికి చేరుకోగానే పరిస్థితి మరింత విషమించింది. ముక్కుతో శ్వాస తీసుకోలేకపోయాడు. కాళ్లు చేతులు కొట్టుకుంటూ అవస్థపడ్డాడు. భర్త బాధ చూడలేక తన నోటితో శ్వాస అందించేందుకు ప్రయత్నించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. భార్య ఒడిలోనే కన్నుమూశాడు.
తల్లి బాధ చూడలేక కొడుకు ఆత్మహత్యః
కర్నాటకలో మనసు ద్రవించే మరో ఘటన జరిగింది. కరోనాతో తల్లి పడుతున్న బాధ చూసి తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుగు జిల్లా మాదరెకు చెందిన 30 ఏండ్ల శరత్‌కుమార్ బెంగళూరులోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఆయన తల్లికి కరోనా సోకడంతో హాసన్‌లోని ఓ హాస్పిటల్లో చేర్చారు. రెండు రోజులుగా ఆమె తీవ్ర ఇబ్బంది పడింది. శరత్ తన బంధువులకు తల్లి బాధ చూడలేకపోతున్నట్లు చెప్పాడు. అనంతరం ఆసుపత్రి పైకి వెళ్లి ఉరేసుకుని చనిపోయాడు. ఆలస్యంగా హాస్పిటల్ సిబ్బంది శరత్ చనిపోవడాన్ని గుర్తించారు.
కరోనా వచ్చిందని భార్యను చంపాడుః
భార్యకు కరోనా వచ్చిందని దారుణంగా చంపేశాడో భర్త. బీహార్ లో ఈ ఘోరం జరిగింది. అతుల్ లాల్ వ్యక్తి రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య ఓ సైతం ఓ కంపెనీలో పనిచేస్తుంది. కొద్ది రోజుల క్రితం భార్యకు జ్వరం వచ్చింది. కరోనా టెస్టు చేయడంతో పాజిటివ్ వచ్చింది. కష్టకాలంలో అండగా నిలవాల్సిన భర్త.. భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతుల్.. బిల్డింగ్ మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.