12 రాష్ట్రాల్లో కరోనా ప్రమాద ఘంటికలు.. లక్ష చొప్పున యాక్టివ్ కేసులు.. బెంగళూరు, చైన్నైలో పరిస్థితి ఆందోళన కలిగిస్తుందన్న లవ్ అగర్వాల్

దేశంలో కరోనా కేసుల సంఖ్య సెకెండ్ వేవ్ లో భారీగా పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా పాజిటివిటీ, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, యూపీ, రాజస్థాన్, ఏపీ, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్‌గడ్, బెంగాల్, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్ల చెప్పారు. 7 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 17 రాష్ట్రాల్లో 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
13 రాష్ట్రాల్లో రోజుకు వంద మంది చొప్పున చనిపోతున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఢిల్లీ, హర్యానాలో మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు చెప్పారు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చాయన్నారు. రోజువారి కేసుల్లో పెరుగుదల అధికంగా కనిపిస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత కాస్త తగ్గినట్లు చెప్పారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోకపోతే.. మున్ముందు వైద్య సేవలు అందించడం కష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజాగా బెంగళూరు, చెన్నైలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్ననట్లు వెల్లడించారు. బెంగళూరులోనే వారం రోజుల్లో 1.5 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. తమిళనాడులో 38 వేల పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు చెప్పారు. కోజికోడ్, ఎర్నాకులం, గురు గ్రామ్ జిల్లాల్లో కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.
అటు 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 6.71 లక్షల మందికి టీకా వేసినట్లు చెప్పారు.