కరోనా కేసుల్లో భారత్ రికార్డు.. ఒకే రోజు 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు.. 3 వేల మందికి పైగా మృతి!

భారత్ లో కరోనా వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కరోనా కేసులు 4 లక్షల మార్క్ దాటాయి. ఒక రోజు ఇన్ని కేసులు నమోదవడం ప్రపంచంలోనే మొదటి సారి. వరుసగా నాలుగో రోజూ 3 వేలకు పైగా జనాలు కరోనాతో కన్నుమూశారు.
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 4 లక్షల 19 వందల 93 మంది కారోనా పాజిటివ్ గా తేలింది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య కోటి 91 లక్షల 64 వేల 969కి చేరింది. ఇందులో కోటి 56 లక్షల 84 వేల 406 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2 లక్షల 11 వేల 853 మంది చనిపోయారు. మరో 32 లక్షల 68 వేల 710 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా 2 లక్షల 99 వలు 988 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 3 వేల 534 మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 15 కోట్ల 49 లక్షల 89 వేల 635 మందికి కరోనా టీకాలు వేసినట్లు వెల్లడించింది.
తాజాగా రికార్డైన కేసుల్లో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ 62 వేల 919 కేసులు నమోదయ్యాయి. 828 మంది చనిపోయారు. కర్నాటకలో 48 వేల 296, కేరళలో 37 వేల 199 కేసులను గుర్తించారు. ఢిల్లీలో నిన్న 375 మంది, యూపీలో 332 మంది చనిపోయారు.