కరోనా కట్టడికి కేంద్రం కఠిన నిర్ణయం.. మే 2 తర్వాత దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ!

దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు పూనుకోబోతున్నది. మృత్యు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్రం నిపుణులతో ఆరా తీసింది. హెల్త్ ఎమర్జెన్సీ కనుక అమలైతే కరోనాను అదుపు చేసేందుకు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి వస్తుంది. కరోనాపై లేనిపోని అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ.. జనాలను భయపెట్టే వారిపైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఔషధాల నుంచి మొదలుకొని ఆక్సీజన్ వరకు అన్నింటి ఉత్పత్తి, సరఫరా, వినియోగంపై పూర్తి స్థాయిలో నియంత్రణ సాధిస్తుంది.
నిజానికి పబ్లిక్ హెల్త్ అనే అంశం రాష్ట్రాల పరిధిలోనిది. కానీ.. తాజాగా కోవిడ్ కారణంగా జాతీయ స్థాయిలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు ఏర్పడ్డాయని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక సైతం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే 2న దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ రిజల్ట్స్ కూడా అదే రోజు వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
భారత రాజ్యాంగంలో హెల్త్ ఎమర్జెన్సీ అనే మాటే లేదు. నేషనల్ ఎమర్జెన్సీ, ఎకనమికల్ ఎమర్జెన్సీ గురించి మాత్రమే ఉంది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ ద్వారా దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించేందుకు అవకాశం ఉందనే అంశంపై కేంద్రం ఇప్పటికే న్యాయకోవిదులతో చర్చలు జరుపుతోంది. గతంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆ తర్వాత ఈ ఆర్టికల్ ను సవరించారు. విదేశీదాడులు, యుద్ధాలు, సైనిక తిరుగుబాటు సమయంలోనూ ఎమర్జెన్సీ విధించేందుకు వీలుగా మార్పులు చేశారు. రాష్ట్రాల్లో అంతర్గత హింసాత్మక ఘటనలు జరిగినా ఈ ఆర్టికల్ ప్రకారం కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో కరోనా కల్లోలం కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చట్టాలను జనాలు ధిక్కరించే అవకాశం ఉంది. ఇది అంతర్గత కల్లోలానికి దారితీసిని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో అంటువ్యాధుల చట్టం-1897, విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.