నందిగ్రామ్‌లో నో రీకౌంటింగ్.. సువేందు విజయం సాధించినట్లు ఈసీ సైట్లో వెల్లడి.. కోర్టులో తేల్చుకుంటామన్న దీదీ!

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ విజయ దుందుభి మోగించింది. రెండు వందల పైచిలుకు సీట్లు గెలిచి తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. అయితే.. యుద్ధంలో సైన్యం గెలిచి రాజు ఓడిపోయినట్లు.. టీఎంసీ భారీ విక్టరీ కొట్టినా.. ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై పోటీకి దిగింది. ఆ ప్రాంతంలో గట్టి పట్టున్న అధికారి.. మమతాను చిత్తుగా ఓడిస్తానని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అన్నట్లుగానే మమతను మట్టికరిపించి జయకేతనం ఎగరువేశారు. 1,736 ఓట్ల తేడాతో దీదీపై విజయం సాధించారు.
తన ఓటమిని జీర్ణించుకోలేని మమతా రీకౌంటింగ్ కు పట్టుబట్టింది. దీదీ డిమాండ్ ను ఈసీ పట్టించుకోలేదు. వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కించాక నిర్ణయిస్తామని చెప్పింది. అయితే వీటిలో కూడా సువేందు అధారికి సేమ్ ఓట్లు రావడంతో మమతా ఓడినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఓట్ల కౌంటింగ్ పై టీఎంసీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఓటమిపై కోర్టుకు కూడా వెళ్తామని మమతా ప్రకటించారు. నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పిన ఆమె.. ఈసీ తీరుపై కోర్టుకు వెళ్తామని వెల్లడించింది. నందిగ్రామ్ ఫలితాలపై ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ కూడా చాలా నెమ్మదిగా అప్‌డేట్ చేస్తూ వచ్చింది. ఈసీ ఇవాళ ఉదయం నందిగ్రామ్ ఫలితాన్ని పూర్తిగా అప్‌డేట్ చేసింది. 17 రౌండ్ల పాటు కొనసాగిన కౌంటింగ్ లో సువేందు అధికారికి 1,09,673 ఓట్లు రాగా.. మమతకు 1,07,937 ఓట్లు పడ్డట్లు వెల్లడించింది.