విజయోత్సవ ర్యాలీలపై నిషేధం.. కరోనా కట్టడికి ఈసీ కఠిన నిర్ణయం!

దేశంలో కరోనా చెలరేగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలోని నాగార్జున సాగర్ శాసనసభ స్థానంతో పాటు ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి సైతం కౌంటింగ్ జరగనుంది. ఈ ఫలితాల అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దని తేల్చి చెప్పింది. విజయం సాధించిన అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి సర్టిఫికేట్ తీసుకునే సమయంలోనూ అభ్యర్థితో పాటు ఇద్దరి కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పింది. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని పార్టీలు, నాయకులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నది.
బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎన్నికలు జరగ్గా.. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. బెంగాల్ లో ఇప్పటికే 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 29న చివరి విడుత ఓటింగ్ జరగనుంది. అయితే కరోనా కేసులు రోజు రోజుకు రెట్టింపు అవుతున్న వేళ ఎన్నికలు పెట్టడం పట్ల ఈసీపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయాలని మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఈసీ దిద్దుబాటు చర్యలకు దిగింది.
ఎన్నికల పేరిట ర్యాలీలు, సభలు జరగడంతో కరోనా తీవ్రత పెరిగిందని పలు ఆరోగ్యసంస్థలు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫుణ్యమా అని బెంగాల్లో కరోనా విళయతాండవం చేస్తోంది. కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే రోడ్ షోలతో పాటు ర్యాలీలు, సభలను నిషేధించిన ఈసీ.. తాజాగా విజయోత్సవ ర్యాలీలపై కఠిన నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే సీరియస్ పనిష్మెంట్ ఉంటుందని హెచ్చరించింది.