EARTHQUAKE: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం.. అసోంలో తీవ్ర ప్రకంపనలు, భారీగా ఆస్తి నష్టం!

ఈశాన్య భారతాన్ని భూకంపం వణికించింది. అసోం, బీహార్, మేఘాలయ, బీహార్ సహా బెంగాల్ లోనూ భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం భారీ భూకంపంతో వణికింది. రాత్రి నుంచి ఉదయం వరకు పలుమార్లు భూమి కంపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు.
రిక్టర్ స్కేలుపై అసోం భూకంపం తీవ్రత 6.4గా నమోదైనట్లు ఎన్‌ఎసీసీ వెల్లడించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానాంద సోనోవాల్ భూకంపం వచ్చిన విషయాన్ని ధృవీకరించారు. రాష్ట్రంలో పెద్ద భూకంపం వచ్చిందని.. ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అసోం మంత్రి హిమంత్ విశ్వశర్మ కూడా భూకంపం వచ్చినట్లుగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. సోనిత్పూర్ జిల్లా దేకియాజులీ కేంద్రంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. గువహటిలో భూకంపం దెబ్బకు కుప్పకూలిన బిల్డింగ్ ఫోటోలను పోస్ట్ చేసారు.
భూకంపం ధాటికి అసోం లోని పలు జిల్లాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఇండ్లు కూలినట్లు సమాచారం అందుతోంది. భూకంప నష్టం గురించి కాసేపట్లో అసోం ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
బీహార్ రాష్ట్రంలో కూడా భూకంపం సంభవించింది. కతిహార్, కిసాన్‌గంజ్, ఖడ్జియా సహా మరికొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటి తీవ్రత 6.1గా నమోదైనట్లు జియాలజీ అధికారులు వెల్లడించారు.
అటు మేఘాలయ, బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. తేజ్ పూర్ కు సమీపంలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.