రాఫెల్ ఒప్పందంపై మొదలైన రగడ..చిక్కుల్లో డస్సాల్ట్ కంపెనీ…ఫ్రాన్స్ లో విచారణకు ఆదేశం…

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల వివాదం మరోసారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది. తాజాగా ఫ్రాన్స్ లో జరుగుతున్న పరిణామాలు రాఫెల్ వివాదానికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. నిజానికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు ఈ రంగంలో ఎలాంటి పూర్వ అనుభవం లేదు. కేంద్ర విమాన తయారీ సంస్థ హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ ను కాదని మరీ 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థ దస్సాల్ట్ భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేశారు. అందులో అవినీతి జరిగిందని 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది.
అయితే దీనిపై సుప్రీం కోర్టులో కూడా వాదనలు సాగాయి. అయితే అప్పుడు ఇదంతా వట్టి పసలేని ఆరోపణలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కొట్టి పారేశాయి. తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా విలేకర్ల సమావేశంలో రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి బయటపడిందని ఆరోపించారు. రిలయన్స్ డిఫెన్స్-డసాల్ట్ డీల్‌లో సాక్ష్యాధారాలను ఫ్రెంచ్ వెబ్‌సైట్ ‘మీడియాపార్ట్’ బయటపెట్టింది. ఇఫ్పటికే ఫ్రాన్సులో దుమారం రేపుతున్న రాఫెల్ అవినీతి వివాదం ప్రస్తుతం బీజేపీ మెడకు కూడా చుట్టుకుంటుందా, అనే అనుమానం కలుగుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఇక జేపీసీ దర్యాప్తునకు అనుమతించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
మరోవైపు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఫ్రాంకోయిస్ హోలాండే, కేంద్ర ప్రభుత్వం సిఫార్సు మేరకే తాము రిలయన్స్ డిఫెన్స్‌ను తన భాగస్వామిగా దస్సాల్ట్ సంస్థ ఎంచుకుందని ఫ్రాన్స్ ఇన్వెస్టిగేటివ్ వైబ్‌సైట్ మీడియా పార్ట్ కు తెలిపారు. ఒప్పందం ఖరారు సమయంలో పలువురికి ముడుపులు ఇచ్చినట్లు పేర్కొంది. భారత్‌లోనూ ఓ మధ్యవర్తికి దాదాపు రూ.8.6 కోట్ల కమీషన్ అందించినట్లు విచారణలో వెల్లడైందని తెలిపింది. ఫ్రెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ చీఫ్ హ్యూలెట్ కు ఈ సంగతి తెలిసినా విచారణను పక్కకు పెట్టేశారని ఆరోపించింది.
ఇందులో అవినీతి, అవకతవకలు బయటపడితే అంతర్జాతీయ సమాజంలో పరువు పోతుందనే హ్యులెట్ తన సహచరులకు నచ్చ చెప్పారని మీడియా పార్ట్ తెలిపింది. మరోవైపు ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు తాజాగా ప్రాన్స్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై దస్సాల్ట్ ఇంకా స్పందించలేదు. ఒప్పందాల ఖరారుపై ఎటువంటి తప్పుడు విధానాలు అవలంభించలేదని గతంలో పేర్కొంది.