COVID VACCINATION: మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్.. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచే రిజిస్ట్రేషన్ ప్రారంభం

కరోనా మహమ్మారి కట్టడికి మరో కీలక ముందడుగు పడబోతుంది. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ తో పాటు 45 ఏండ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సీన్ ఇవ్వగా… మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి సైతం టీకా ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిని రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి మొదలుకానుంది. అర్హులైన వాళ్లంతా కోవిన్ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించింది.
కోవిన్ సైట్ తో పాటు ఆరోగ్యసేతు, ఉమాంగ్ యాప్ లోనూ తన పేరు నమోదు చేసుకోవచ్చిన కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా తెలిపింది. మే 1 వరకు రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ చేసే టీకా సెంటర్ల ఆధారంగా అపాయింట్ మెంట్ అందుతుందని కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. 18 ఏండ్లు నిండిన వారంతా టీకా కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పింది. అటు కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సీన్లను కేవలం 45 ఏండ్లు నిండిన వారికే ఇవ్వాలని సూచించింది. రాష్ట్రాలు, ప్రైవేట్ వ్యాక్సీన్ సెంటర్లు కొనుగోలు చేసిన వ్యాక్సీన్లు మాత్రమే 18 నుంచి 45 ఏండ్ల వారికి ఇవ్వాలని చెప్పింది. cowin.gov.inలో కరోనా వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్క లాగిన్ తో నలుగురికి అపాయింట్‌మెంట్ పొందవచ్చు.