నాలుగు రోజుల్లో సీఎం యోగీ ఖతం.. మరోసారి ఆగంతకుల బెదిరింపు కాల్స్ .. కేసు దర్యాప్తు చేస్తున్న నిఘా బృందం!

యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ పని నాలుగు రోజుల్లో ఖతం అవుతుంది. ఆయన మరణం తప్పదు అంటూ తాజాగా బెదిరింపులు వచ్చాయి. ఏకంగా యూపీ పోలీస్ నెంబర్ 112కే ఆగంతకులు కాల్ చేసి సీఎం హత్యపై వార్నింగ్ ఇచ్చారు. ఏప్రిల్ 29న గుర్తు తెలియని ఫోన్ నుంచి సీఎం ఆదిత్యానాథ్‌కు ఇంకా నాలుగు రోజులే మిగిలున్నాయి. ఆయనకు చావడం తప్పదని మెస్సేజ్ పంపించారు.
ఈ బెదిరింపులపై ఇప్పటికే సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వార్నింగ్ ఇచ్చింది ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు ఖాకీలు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిఘా బృందం ఈ కేసును టేకప్ చేసింది. త్వరలో ఆగంతకులను అరెస్టు చేస్తామని తెలిపింది.
యూపీ సీఎం యోగికి బెదిరింపు కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో కూడా హోంమంత్రి అమిత్‌షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ చంపేస్తామని బెదిరిస్తూ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు ఈ మెయిల్ వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ లో సైతం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని బెదిరిస్తూ కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్ పై పోలీసులు ఇంత వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు. అయినా వీటిపై ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.