జాతీయ స్థాయి లాక్ డౌన్ కు సర్వత్రా డిమాండ్.. ఆకలి చావులు, ఆర్థిక సమస్యలు వస్తాయి.. ఆదిశగా ఆలోచించడం లేదన్న కేంద్రం

దేశంలో కరోనా వీర విహారం చేస్తుంది. సెకెండ్ వేవ్ లో రోజుకు మూడు లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 4 లక్షల పైచిలుకు కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో కేసులతో పాటు మరణాల సంభవిస్తున్న తరుణంలో జాతీయ స్థాయిలో లాక్ డౌన్ విధించాలని ప్రధాని మోదీపై ఒత్తిడి పెరుగుతోంది.
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అనుకూలంగా లేనట్లు తాజా ప్రకటనలు సూచిస్తున్నాయి. దేశంలోని సగానికి పైగా జిల్లాల్లో కరోనా నియంత్రణలో ఉందని ప్రభుత్వం చెప్తోంది. ఈ పరిస్థితిలో దేశ వ్యాప్తంగా గతేడాదిలా జాతీయ స్థాయి లాక్‌డౌన్ విధించడం కరెక్ట్ కాదని వాదిస్తుంది. ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే.. దీని పేదలకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయంటుంది.
అటు కొత్త కేసుల పాజిటివిటీ అధికంగా ఉన్న రాష్ట్రాలు ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో పరిమిత, పూర్తిస్థాయి లాక్‌డౌన్ పెట్టారు. దీని మూలంగా కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
సెకెండ్ వేవ్ లో ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్న మహారాష్ట్రలో ఏప్రిల్ 5న కర్ఫ్యూ లాంటి లాక్‌డౌన్ పెట్టారు. జన సంచారంపై ఆంక్షలు విధించారు. ఈ నిషేదాజ్ఞలు మే 15 వరకు కొనసాగుతాయని వెల్లడించారు. ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లో లాక్‌డౌన్‌ను మే 10 వరకు విధించారు. చత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్‌ను మే 15 వరకు పొడిగించారు. భారీగా కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం మే 15 వరకు లాక్‌డౌన్ కు ఓకే చెప్పింది. ఒడిశాలో మే 19 వరకు లాక్‌డౌన్ విధించారు. పంజాబ్ లో మినీ లాక్‌డౌన్ కొనసాగుతుంది. వారాంతపు లాక్‌డౌన్ తోపాటు నైట్ కర్ఫ్యూ మే 15 వరకు అమలు చేసస్తున్నారు. రాజస్థాన్ లో మే 17 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. గుజరాత్ లోని 29 పట్టణాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లో కరోనా కర్ఫ్యూ మే 7 వరకు అమలులో ఉంది. అస్సాం లో నైట్ కర్ఫ్యూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. నైట్ కర్ఫ్యూ మే 7 వరకు అమలులో ఉంది. తమిళనాడులో మే 20 వరకు కరోనా ఆంక్షలు విధించారు. కేరళలో మే 9 వరకు లాక్‌డౌన్ తరహా కఠిన ఆంక్షలు ఉన్నాయి. కర్ణాటకలో మే 12 వరకు లాక్‌డౌన్ కొనసాగుతోంది. జార్ఖండ్ లో ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంది. గోవాలో కోవిడ్ –19 కారణంగా ఆంక్షలు మే 10 వరకు కొనసాగుతాయి.
ఆంధ్రప్రదేశ్ లో మే 5వ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రెండు వారాల పాటు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మే 8 వరకు కొనసాగుతుంది. పుదుచ్చేరిలో లాక్‌డౌన్ మే 10 వరకు పొడిగించారు. నాగాలాండ్ లో మే 14 వరకు కఠినమైన నిబంధనలతో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. జమ్మూ కశ్మీర్ లో లాక్‌డౌన్‌ను మే 6 వరకు పొడిగించారు.
మరోవైపు కరోనా కల్లోలం నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ పై ఆలోచించాలని.. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించింది.
One thought on “జాతీయ స్థాయి లాక్ డౌన్ కు సర్వత్రా డిమాండ్.. ఆకలి చావులు, ఆర్థిక సమస్యలు వస్తాయి.. ఆదిశగా ఆలోచించడం లేదన్న కేంద్రం”