దేశంలో కరోనా అంతానికి కీలక ముందడుగు.. చిన్నారులపై కోవాక్సిన్ ట్రయల్స్.. ఎక్స్ పర్ట్ ప్యానెల్ ఆమోదం

చిన్నారులను కరోనా నుంచి కాపాడేందుకు భారత్ లో శరవేగంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. రెండేండ్లు పైబడిన పిల్లలపై కోవాక్సిన్ టీకా ట్రయల్స్ జరగబోతున్నాయి. 2 నుంచి 18 ఏండ్ల వయసు ఉన్న పిల్లలకు కోవాక్సిన్ సెకెండ్, థర్డ్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ట్రయల్స్ కు ఎక్స్ ఫర్ట్స్ కమిటీ ఓకే చెప్పింది. ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే.. కెనడా, అమెరికా తర్వాత భారత్‌లో కూడా 18 ఏండ్లలోపు పిల్లలకు స్వదేశీ వ్యాక్సిన్ రెడీ అవుతుంది.
ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ పాట్నా, మెడిట్రినా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నాగ్‌పూర్‌లో 525 అంశాలపై క్లినికల్ ట్రయల్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ ప్రతిపాదనను సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కమిటీ పరిశీలించింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్కో), సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కమిటీ (ఎస్ఈసీ) గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చింది. మూడో దశ ట్రయల్స్ కోసం సీడీస్కో నుంచి అనుమతి తీసుకునే ముందు డాటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ (డీఎస్ఎంబీ) కి రెండవ దశకు సంబంధించి సెక్యూరిటీ డాటాను అందించాలని నిపుణుల కమిటీ భారత్ బయోటెక్ ను ఆదేశించింది. అంతకు ముందు ఫిబ్రవరి 24న జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించింది. సవరించిన క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్‌ను ప్రవేశపెట్టాలని ఆదేశించింది.
ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాక్సిన్ టీకాను.. ప్రస్తుతం 18 ఏండ్లు నిండిన వారికి అందిస్తున్నారు 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు ఫైజర్-బయోఎంటెక్ కరోనా వ్యాక్సిన్‌ను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఆమోదించింది. కెనడా ఇప్పటికే పిల్లల టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.