Dhaaravi: ధారావి జయించింది: కోవిడ్ పై గెలుపు దిశగా అతిపెద్ద మురికివాడ!

ధారావి…ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ. ముంబైలో ఇది ఒక్కప్పుడు కరోనా హాట్ స్పాట్. కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలాడింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారాయి. కోవిడ్ ను జయించింది. గడిచిన 24గంటల్లో కేవలం మూడు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో ధారావిలో అతితక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి:నన్ను అరెస్టు చేయడం మీతరం కాదు: రాందేవ్ బాబా
ధారావి ముంబైలో అత్యంత ఇరుకైన ప్రాంతం. ఇక్కడ దాదాపు 8లక్షలకు పైగా జనాభా నివసిస్తోంది. 6వేలకు పైగా యాక్టివ్ కేసులు నమోదు కాగా…6వేలమంది కోలుకున్నారు. మిగిలినవారు చికిత్స తీసుకుంటున్నారు. భారీ జనాభా కలిగిన ఈ ప్రాంతంలో సోమవారం 16కేసులు, మంగళవారం 7కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా కేవలం మూడు కేసులు మాత్రమే నమోదు కావడంతో మహమ్మారీ అదుపులోకి వచ్చిందని అంచనా వేస్తున్నారు అధికారులు.
మొదటి దశ కరోనా దేశాన్ని పట్టిపీడించిన సమయంలో ధారావిలో గతేడాది ఏప్రిల్ 1న మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతోపాటు తొలిమరణం కూడా చోటుచేసుకుంది. మే 3న అప్పట్లో అత్యధికంగా 94 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మురికివాడలో కరోనా కట్టడి బీఎంసీ అధికారులకు సవాల్ గా మారింది.
స్థానికుల సహకారం, అధికారుల చొరవ….మహమ్మారిని దీటుగా నియంత్రించారు. వీటికి తోడు ప్రపంచ ఆరోగ్యం సంస్థ, ప్రపంచ బ్యాంక్, కేంద్ర సర్కార్ కరోనాపై ధారావి పోరాటాన్ని అభినందించారు. రెండో దశలోనూ అదే స్పూర్తితో మహమ్మారిని విజయవంతంగా జయించే దిశగా సాగుతోంది ధారావి.