క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. 10 మంది కుటుంబ సభ్యులకు పాజిటివ్.. ట్విట్టర్ ద్వారా తెలిపిన అశ్విన్ భార్య ప్రీతి!

టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఇంట్లో ఉన్న 10 మంది కుటుంబ సభ్యులకు మహమ్మారి వ్యాపింది. ఈ విషయాన్ని అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణ్ వెల్లడించింది. తాజాగా కుటుంబ సభ్యులు కరోనా టెస్టు చేసుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. కరోనా కారణంగా ఐపీఎల్ నుంచి అశ్విన్ ఇప్పటికే తప్పుకున్నాడు.
తాజాగా చెన్నైలో ఉంటున్న అశ్విన్ కుటుంబ సభ్యులంతా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇంట్లోని ఆరుగురు పెద్ద వాళ్లకు.. నలుగురు చిన్న పిల్లలకు వైరస్ సోకినట్లు వెల్లడైంది. పిల్లల కారణంగానే ఇంట్లో వాళ్లకు కరోనా సోకినట్లు ప్రీతి తెలిపింది. కుటుంబ సభ్యులంతా కొందరు వేర్వేరు ఇళ్లలో ఉండగా.. మరికొందరు ఆస్పత్రిల్లో చేరినట్లు చెప్పింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నది. ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని సూచించింది.
ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఆడుతున్న అశ్విన్.. ఐపీఎల్ సీజన్ కు తాత్కాలికంగా విరామం చెప్పినట్లు గత సండే ట్వీట్ చేశాడు. ఈ సీజన్ లో కరోనా కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్న తొలి క్రికెటర్ అతడే. కరోనా సోకిన తన కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అశ్విన్ చెప్పాడు.