నీలి చిత్రాల వ్యవహారంలో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు..!

ప్రముఖ బిజినెస్ మెన్, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోర్న్ వీడియోలను చిత్రీకరించి కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా ప్రసారం చేస్తున్నరన్న ఆరోపణల కారణంతో కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు దగ్గర కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను కుంద్రా నుంచి రాబట్టడానికే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక ముంబై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోర్న్ వీడియోలను యాప్ లో రిలీజ్ చేస్తున్నారన్న ఆరోపణలపై రాజ్ కుంద్రాపై గత ఫిబ్రవరిలో కేసు నమోదైందన్నారు. ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రా ప్రధాన పాత్ర పోషించారని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలతో సహా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొబైల్ యాప్స్ లో రిలీజ్ చేస్తున్న వీడియోలకు రాజ్ కుంద్రా ప్రొడ్యూసర్ గా వ్యవహరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.